మహిళల న్యాయపరమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి లీగల్ సెల్‌

  • తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి జాతీయ ఛైర్మన్ రేఖా శర్మ
  • అందుబాటులో వాట్సాప్ నెంబర్ సునీతా లక్ష్మారెడ్డి
హైదరాబాద్: మహిళలకు చట్టబద్ధమైన సహాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో సోమవారం నాడు మహిళల న్యాయపరమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి ‘లీగల్ సెల్‌’ ను జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ మరియు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత న్యాయ సలహాలు, సేవలు అందించడమే న్యాయ సహాయ కేంద్రం లక్ష్యమని  జాతీయ చైర్మన్ రేఖా శర్మ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కమిషన్ కార్యక్రమాలను, సేవలను అడిగి తెలుసుకున్నారు.

లీగల్ సెల్ మహిళల హక్కులను పరిరక్షించడంపై దృష్టి సారించడం మరియు వారికి చట్టపరమైన సలహాలు మరియు సహాయం కోసం వన్-స్టాప్ సెంటర్‌గా పనిచేస్తుందని మహిళలు ఎక్కడికీ వెళ్లకుండా న్యాయ సహాయం పొందగలుగుతారని చైర్‌పర్సన్ తెలిపారు. వాక్-ఇన్ ఫిర్యాదుదారులకు కౌన్సెలింగ్ అందించడంతో పాటు ఆపదలో ఉన్న మహిళలకు న్యాయ సహాయం, సలహాలు మరియు వివిధ పథకాలపై సమాచారం అందిస్తుందని జాతీయ చైర్ పర్సన్ రేఖా శర్మ అన్నారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కమిషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. మహిళా సాధికారత, మహిళల రక్షణ, మహిళా అభ్యున్నతికి మరియు రాష్ట్ర మహిళా కమిషన్, చట్టాలపై మహిళా చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు మరియు మానవ అక్రమ రవాణపై చేస్తున్న కార్యక్రమాల గురించి జాతీయ మహిళ కమిషన్ చైర్ పర్సన్ కు వివరించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్  మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళలకు చెరువుగా ఉండేందుకు ప్రారంభించిన వాట్సాప్ హెల్ప్ లైన్ 9490555533 మరియు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ @SCWTelangana ద్వారా మహిళా కమిషన్ కి వస్తున్న పిర్యాదులు గురించి తెలియజేశారు.

తెలంగాణ ప్రభుత్వం అక్రమ రవాణకు గురవుతున్న వారిని గుర్తించి రక్షించడంతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తూ ఇతర సౌకర్యాలు కల్పిస్తోందని చైర్ పర్సన్ తెలిజేశారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ జిల్లాల్లో ఏ.హచ్. టి.యు లు ఏర్పాటు చేసిందని అలాగే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పిల్లలు, మహిళలపై సైబర్ నేరాలు, ఆన్ లైన్ ట్రాఫికింగ్ అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంటీ హ్యూమన్ ట్రాఫకింగ్ యూనిట్స్, షీ సైబర్ సెల్ ఏర్పాటు చేసిందని తెలిజేశారు. అలాగే ఒడిషా నుంచి వలస వచ్చిన కూలీల పిల్లల కోసం మరియు ట్రాఫికింగ్ లో గుర్తించిన వారికోసం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో పోలీస్ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ కలిసి ఒరియా పాఠశాలను ఏర్పాటు చేశారని తెలిపారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల మూడో శనివారం నాడు రాష్ట్రంలో అన్ని ఐసీడీస్ ప్రాజెక్టులలో స్వరక్ష డే నిర్వహించడం జరుగుతుందని చైర్ పర్సన్ తెలిపారు. మానవ అక్రమ రవాణాను అరిక్టేందుకు అంతర్ రాష్ట్రాల సహకారం ఎంతో ముఖ్యమని చైర్ పర్సన్ జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్, కొమ్ము ఉమాదేవి యాదవ్ , గడ్డలా పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతి రావు మరియు సెక్రటరీ కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

More Press News