తెలంగాణ‌లో అడవుల పునరుద్ధరణకు సమగ్ర కార్యాచరణ: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

  • అటవీ సంరక్షణ, పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్ర‌భుత్వ‌ కృషి

  • అటవీ ప్రాంత పునరుద్ధరణ - జాతీయ, అంతర్జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహల అభివృద్ధి స‌దస్సును ప్రారంభించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా అడ‌వుల పునరుజ్జీవ‌నం, అట‌వీ ప్రాంత పున‌రుద్ద‌ర‌ణ‌, పచ్చదనం పెంపొందిచ‌డ‌మే ల‌క్ష్యంగా తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అటవీ ప్రాంత పునరుద్ధరణ - జాతీయ, అంతర్జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహల అభివృద్ధి స‌దస్సును మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. గురువారం ఓ ప్రైవేట్ హోట‌ల్ లో ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌), కేంద్ర, రాష్ట్ర‌ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖల సంయుక్త భాగ‌స్వామ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామ‌న్నారు. నాలుగేళ్ల‌ కిందట ప్రారంభమైన పునరుద్ధరణ పనుల సత్ఫలితాలు ఇప్పుడు ప్రత్యక్షంగా కన్పిస్తున్నాయన్నారు. తెలంగాణలో పచ్చదనాన్ని 33శాతం పెంచడానికి పెద్ద ఎత్తున తెలంగాణకు హరితహారం కార్యక్రమం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ‌లో పచ్చదనం, అటవీ ప్రాంత  పునరుద్దరణ 3 లక్షల హెక్టార్లకు పెరిగిందని వెల్లడించారు. వ‌చ్చే ఐదేండ్ల‌లో 10 ల‌క్ష‌ల‌ హెక్టార్ల అడ‌వుల‌ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

అట‌వీ పున‌రుజ్జీవ‌, పునరుద్ద‌ర‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా 2 ల‌క్ష‌ల 65 వేల హెక్టార్ల‌లో అటవీ స‌రిహ‌ద్దుల ర‌క్ష‌ణ‌, నేలలో తేమను నిలుపుకోవడం, అగ్ని ప్ర‌మాదం నిరోధించ‌డంతో పాటు ఇత‌ర చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ఉపయోగపడితే అడవుల పెంపకం మొత్తం వాతావరణంలో మార్పు తెస్తుందని, వర్షాలు బాగా కురవటానికి, జీవ వైవిధ్యానికి దోహదపడుతుందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, యూఎస్ ఎయిడ్ ఇండియా ప్రతినిధి వర్గీస్ పాల్, కేంద్ర అటవీ శాఖ ఐజి పంకజ్ ఆస్థాన, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ సుభాష్ అషుతోష్, అటవీ పరిశోధన డీజీ సురేష్ గైరోల, పీసీసీఎఫ్ ఆర్. శోభ, అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


More Press News