హైదరాబాద్ వాసులకు అడ్వెంచర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభించిన మంత్రులు!
మసీదుగడ్డ జంగిల్ క్యాంప్ ను ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
నగర, పట్టణ వాసులకు శారీరక ధారుడ్యం మానసికోల్లాసంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులు (అటవీ ఉద్యానవనాలు) దోహదం చేస్తాయని తెలంగాణ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ శివారులో అవుటర్ రింగ్ కు సమీపాన పెద్ద గోల్కొండ, తుక్కుగూడ గ్రామాల మధ్యన మసీదుగడ్డ రిజర్వ్ ఫారెస్ట్ లో జంగిల్ క్యాంప్ (అర్బన్ ఫారెస్ట్ పార్క్)ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అడవుల సంరక్షణ, అభివృద్దికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధన్యతనిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అడవులను రక్షించడమే కాకుండా.. నగరాలు పట్టణాలకు దగ్గరలో నిరూపయోగంగా ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకులను ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజలకు ఓ మెరుగైన జీవనం కోసం స్వచ్చమైన గాలిని అందించడానికి అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో పార్క్ ను ఒక్కో థీమ్ తో మొత్తం 94 పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, అందులో HMDA పరిధిలో 60, ఇతర పట్టణాల్లో 34 అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. ఇప్పటికే 31 పార్కులు పూర్తి కాగా అందులో HMDA పరిధిలో - 17, ఇతర పట్టణాల్లో - 14 ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు.
అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చాలన్న లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇందులో భాగాంగనే అడ్వెంచర్ క్యాంప్ థీమ్ తో మసీదుగడ్డ రిజర్వ్ ఫారెస్ట్ లో జంగిల్ క్యాంప్ (అర్బన్ ఫారెస్ట్ పార్క్) ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారని తెలిపారు. నగర వాసులు కుటుంబంతో రోజంతా ఆహ్లాదంగా గడపడానికి అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారని మంత్రి వెల్లడించారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ శివారులో నాణ్యమైన జీవన వాతావరణాన్ని కల్పించేందుకు జంగిల్ క్యాంప్ పార్కును ఏర్పాటు చేశారని, ఈ పార్కు నగర వాసులకు వరంగా మారిందన్నారు. ఇతర నగరాల మాదిరిగా హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్ గా మారకూడదన్న ఉద్దేశ్యంతో అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ కు, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో మరిన్ని పార్కులు ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆమె కోరారు.
మసీదుగడ్డ జంగిల్ క్యాంప్ - అర్బన్ ఫారెస్ట్ పార్క్:
మసీదుగడ్డ జంగిల్ క్యాంప్ (అర్బన్ ఫారెస్ట్ పార్కు) ను 180.03 హెక్టార్లలో రూ.4.34 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా రూపొందించారు. నగర వన ఉద్యాన యోజన, కంపా, అటవీ శాఖ నిధులతో ఈ పార్కును అభివృద్ది చేశారు.
ఈ ఫారెస్ట్ పార్కుని ప్రధానంగా అడ్వెంచర్ జోన్, జంగిల్ క్యాంప్ అని రెండు సెక్టార్లుగా ఏర్పాటు చేశారు. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ ట్రాక్ లతో పాటు క్యాంపింగ్ ఫెసిలిటీస్, సాహాస క్రీడలు, సైక్లింగ్ ట్రాక్, పాత్- వే, చిన్న పిల్లలకు ప్రత్యేక ఆట స్థలం, గజీబోలు, మల్టిపర్పస్ షెడ్స్, కుటుంబంతో గడిపేందుకు పిక్నిక్ స్పాట్, అక్కడే వంట చేసుకుని వీలుగా ప్రత్యేక ప్రాంతాలను కూడా ఈ పార్కులో ఏర్పాటు చేశారు. సందర్శకుల రక్షణ చర్యలో భాగంగా క్యాంపింగ్ ఏరియా చుట్టు చైన్ లింక్డ్ ఫెన్స్, పాములు చొరబడకుండా ఫ్రూప్ ట్రెంచ్ ఏర్పాటు చేశారు. పార్కులో ఉన్న రోడ్లకు విధి నిర్వహణలో ప్రాణాలు కొల్పోయిన తెలంగాణ అటవీ అమరవీరుల పేర్లను వారి త్యాగాలకు గుర్తుగా పెట్టారు.
ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (PCCF) ఆర్.శోభ లు గ్రీన్ ఛాలెంజ్ నిర్వహించారు. శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో జంగిల్ క్యాంపు అర్బన్ ఫారెస్ట్ అడ్వంచర్ క్యాంపు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఈ అధికారులు ఆ తర్వాత అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు.
చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి ఇటీవల విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను అంగీకరించిన రాజేశ్వర్ తివారి మూడు మొక్కలు నాటి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు లను నామినేట్ చేశారు. ఇదే కార్యక్రమంలో ఉన్నఅజయ్ మిశ్రా వెంటనే మొక్కలు నాటి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, మహేశ్వరం ఎంపీసీ రఘుమారెడ్డి, హర్షగూడ సర్పంచ్ పాండు నాయక్ లను నామినేట్ చేశారు.
ఇక చీఫ్ సెక్రటరీ జోషితో పాటు, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (TUFIDC) చైర్మన్ కే. విప్లవ్ కుమార్ ఇచ్చిన రెండు గ్రీన్ ఛాలెంజ్ లను స్వీకరించిన పీసీసీఎఫ్ ఆర్.శోభ మొత్తం ఆరు మొక్కలు నాటి మరో ఆరుగురిని నామినేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీఎఫ్ ఎన్.ప్రతీప్ కుమార్, తెలంగాణ అదనపు పీసీసీఎఫ్ లు ఆర్.ఎం.డోబ్రియల్, పర్గెయిన్, లోకేష్ జైస్వాల్, స్వర్గం శ్రీనివాస్, సీసీఎఫ్ సునితా భగవత్ లను మొక్కలు నాటాల్సిందిగా గ్రీన్ ఛాలెంజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అటవీశాఖ అధికారులు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు, తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోందని అన్నారు. పర్యావరణ సృహ పెంచటంతో పాటు, అందరూ మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలన్న పట్టుదలను గ్రీన్ చాలెంజ్ పెంచుతోందని ప్రశంసించారు.