తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “తెలుగుపద్యంలో కనీవినీ ఎరుగని వృత్తాలు”విజయవంతం

డాలస్, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” (ప్రతినెలా ఆఖరిఆదివారం) లో భాగంగా ఆదివారం జరిగిన 48వ అంతర్జాతీయ అంతర్జాలదృశ్యసమావేశం లో “తెలుగుపద్యంలో కనీవినీ ఎరుగని వృత్తాలు” అనే సాహిత్య కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.

తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్య వికాసాల కోసం క్రమం తప్పకుండా ప్రతి నెలా జరుగుతున్న ఈ నాటి కార్యక్రమం తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలుగుతేజం నందమూరి తారక రామారావు గారి శతజయంతి రోజున జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.తానా సాహిత్యవేదిక నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ఈనాటి కార్యక్రమం చాలా విశిష్టమైంది అన్నారు. 

సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. తోటకూర ప్రసాద్ అతిథులందరినీ ఆహ్వానిస్తూ - తెలుగు ఛందస్సులో మొత్తం 13 కోట్ల 42 లక్షల 17 వేల 726 వృత్తాలున్నాయని పరిశోధనల ద్వారా వెల్లడవుతోందని కాని ఇప్పటివరకు తెలుగు లక్షణకారులు చెప్పిన వృత్తాలు కేవలం 437 మాత్రమే కావడం ఆశ్చర్యం అన్నారు. “సాహితీబంధు”, “ఛందశాస్త్ర రత్నాకర” బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారి పరిశోధనలో 1,863 క్రొత్త వృత్తాలను వెలికి తీయడం ఒక విశేషం అని అంతేగాక గురు తోపెల్ల గారు 100 మంది పద్యకవులు, ఒక్కొక్కరు 100 వృత్తాలతో (వాడిన వృత్తాలు వాడకుండా) మొత్తం 10,000 పద్యాలను వ్రాయించి, ఆ పద్యాల సంకలనాన్ని“అనంతచ్చందసౌరభము”అనే గ్రంధరూపంలో అక్టోబర్, 2022లో ప్రచురించడం సాహితీ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం అన్నారు. ఈ నాటి తానా ప్రపంచసాహిత్యవేదికలో 50 మంది పద్యకవులు పాల్గొంటూ క్రొత్త వృత్తాలతో తాము రాసిన 150కి పైగా పద్యాలను గానం చేయడం ఒక ప్రత్యేకత అన్నారు. 

ముఖ్యఅతిథిగా పాల్గొన్న “గురు సహస్రావధాని” డా. కడిమిళ్ళ వరప్రసాద్ మాట్లాడుతూ గురు తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ చేసిన సాహిత్యకృషి మాటలకందనిది అంటూ ఎన్ని విశ్వవిద్యాలయాలు, ఎన్ని గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసినా అవి సరితూగవు అని ప్రశంసించారు. గౌరవఅతిథి గా పాల్గొన్న ఐ ఐ టి ముంబాయి విశ్రాంత ఆచార్యులు డా. గోసుకొండ సుబ్రహ్మణ్యం గురు తోపెల్ల శర్మ గారి శిక్షణలో తాను కూడా పద్యరచన చేయడం ఒక మధురమైన అనుభవం అన్నారు.

50 మంది పద్యకవులు విశిష్ట అతిథులుగా పాల్గొని తాము రాసిన క్రొత్త వృత్తములలోని పద్యాలను శ్రావ్యంగా ఆలపించి సాహితీ ప్రియులందరినీ అలరించారు. వందమంది సుకవులలో స్ఫూర్తిని నింపి, ఒక్కొక్కరితో 100 క్రొత్త వృత్తములలో (వాడిన వృత్తము వాడకుండా) పద్యరచన చేయించి, మొత్తం 10,000 పద్యకుసుమాలతో “అనంతచ్ఛంద సౌరభము” అనే అపురూప ఉద్గ్రంధానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయి 2022 లో ముద్రణరూపంలో సాహిత్యలోకానికి అందమైన కానుకగా అందించిన అనంతచ్ఛంద రూపశిల్పి, బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి తానా ప్రపంచసాహిత్యవేదిక ఈ సభలో శిష్యులందరి కరతాళధ్వనులమధ్య "ఛందస్సమ్రాట్" అనే బిరుదుతో సగౌరవంగా సత్కరించి సన్మాన జ్ఞాపికను సమర్పించారు.


More Press News