Broadcasters: ఐసీసీ మీడియా హక్కుల వేలం సన్నాహకాలకు వయాకామ్, డిస్నీ, సోనీ, జీ సంస్థలు దూరం
- మరికొన్నిరోజుల్లో ఐసీసీ మీడియా హక్కుల వేలం
- భారత్ లో గట్టిపోటీ.. రేసులో నాలుగు దిగ్గజ సంస్థలు
- బిడ్డింగ్ ప్రక్రియ పట్ల అభ్యంతరాలు!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరికొన్ని రోజుల్లో భారత్ లో మీడియా హక్కుల కోసం వేలం ప్రక్రియ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో, వేలం ప్రక్రియకు సన్నాహకంగా నేడు నమూనా వేలం నిర్వహించింది. అయితే ఈ సన్నాహక వేలానికి దిగ్గజ బ్రాడ్ కాస్టర్లు వయాకామ్ 18, డిస్నీ, సోనీ, జీ సంస్థలు దూరంగా ఉన్నాయి.
అయితే, ఐసీసీ బిడ్డింగ్ ప్రక్రియ పట్ల అసంతృప్తి కారణంగానే ఈ నాలుగు సంస్థలు సన్నాహక వేలంలో పాల్గొనలేదని తెలుస్తోంది. రేపు నమూనా వేలం ప్రక్రియకు రెండోరోజు. రేపటి సన్నాహక వేలంలో అయినా ఏవైనా సంస్థలు పాల్గొనేందుకు మొగ్గు చూపుతాయా అనేది సందిగ్ధంగా మారింది.
క్రికెట్ వర్గాల ప్రకారం.... ఆ నాలుగు ప్రసార సంస్థలు ఐసీసీ బిడ్డింగ్ ప్రక్రియ పట్ల తీవ్ర అభ్యంతరాలతో ఉన్నాయి. ఐసీసీ విధానం పట్ల ఆ సంస్థలు అసంతృప్తిని వ్యక్తం చేయడం ఇదే మొదటిసారికాదు. తమ అభ్యంతరాల పట్ల పలుమార్లు ఐసీసీకి లిఖితపూర్వకంగా తెలియజేసినా, అట్నుంచి వచ్చిన స్పందనల్లో సంతృప్తికరమైన అంశాలు లేవని ఆయా సంస్థలు భావిస్తున్నాయి.
మరోపక్క, ఈ వేలంలో పాల్గొనేందుకు అమెజాన్, ఫాన్ కోడ్ సంస్థలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, ఈ రెండు సంస్థలు రేపటి నమూనా వేలంలో పాల్గొనేది, లేనిది స్పష్టత లేదు. ఐసీసీ, బిడ్డర్లకు మధ్య ప్రధాన వేలం ప్రక్రియలో అవగాహన కోసం ఈ రెండ్రోజుల సన్నాహకం నిర్వహిస్తున్నారు.