మెటా ఉద్యోగి విషాద గాథ.. తాను తయారు చేసిన టూల్‌ తన ఉద్యోగాన్నే తీసేసింది!

AI Tool Created by Meta Employee Led to Her Layoff
  • మెటా కంపెనీలో భారీ లేఆఫ్స్
  • అంతకుముందు ఉద్యోగులకు ‘ఏఐ వీక్‌’ నిర్వహణ
  • సొంతంగా ఏఐ టూల్స్ నిర్మించాలని సూచన
  • అదే టూల్ ఇప్పుడు ఓ ఉద్యోగిని జాబ్‌ పోవడానికి కారణం
  • ఆమె భర్త జూలియన్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌
కన్న బిడ్డ లాంటి ఐడియా.. చేతులతో ప్రాణం పోసిన ఏఐ టూల్.. తీరా చూస్తే అదే తన ఉద్యోగాన్ని మింగేసింది! టెక్ ప్రపంచంలో గుండెలు పిండేసే ఒక దారుణమైన నిజం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఐదు రోజుల ‘AI వీక్’
కొన్ని నెలల క్రితం టెక్‌ దిగ్గజం మెటా అంతర్గతంగా ‘ఏఐ వీక్’ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ సమయంలో ఉద్యోగుల రోజువారీ విధులను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ప్రతి ఒక్కరూ ఏఐ సాధనాలపై పట్టు సాధించాలని, వాటితో కొత్త టూల్స్ సృష్టించాలని యాజమాన్యం ఆదేశించింది. అందులో భాగంగా కంపెనీ పనితీరును మెరుగుపరిచే కొన్ని ప్రాజెక్టులను ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. వాటి అభివృద్ధి బాధ్యతలను ఇంజనీర్లకు అప్పగించారు.

వైరల్ పోస్ట్
ఈ ప్రక్రియలో పాల్గొన్న ఒక మహిళా ఉద్యోగిని భర్త ‘జూలియన్’ ‘ఎక్స్‌’లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన భార్య సీనియర్ లీడర్‌షిప్ బృందంతో కలిసి ఒక అద్భుతమైన ఏఐ టూల్‌ను సిద్ధం చేయడానికి కొన్ని నెలల పాటు కష్టపడిందని జూలియన్ పేర్కొన్నాడు. తాను తయారు చేస్తున్న టూల్ భవిష్యత్తులో తన ఉద్యోగానికే ఎసరు పెడుతుందేమోనని ఆమె ముందే భయపడింది. అనుకున్నట్లుగానే ఆ ఏఐ ప్రాజెక్ట్ పూర్తయిన కొన్ని రోజులకే ఆమెకు లేఆఫ్ మెయిల్ వచ్చింది.

వేలాది మందిపై ఏఐ లేఆఫ్స్ ప్రభావం
మెటా సంస్థ అంతర్జాతీయంగా దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. సింగపూర్, యూరప్, అమెరికాలోని ఉద్యోగులకు మే 20 తెల్లవారుజామున 4 గంటల నుంచే టర్మినేషన్ ఈమెయిల్స్ రావడం ప్రారంభమయ్యాయి. కంపెనీని మరింత సరళంగా మార్చడానికి, చిన్న చిన్న ఏఐ గ్రూపులను ఏర్పాటు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెటా హెచ్ఆర్ చీఫ్ జానెల్ గేల్ అంతర్గత మెమోలో పేర్కొన్నారు.

వందల బిలియన్ల పెట్టుబడులు
మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ప్రస్తుతం ఏఐ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. గూగుల్, ఓపెన్‌ఏఐ సంస్థలకు పోటీగా ఈ ఏడాది ఏఐ మౌలిక సదుపాయాల కోసం మెటా దాదాపు 100 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయనుంది. అయితే ఉద్యోగుల కంప్యూటర్ల నుంచి డేటాను సేకరించి ఏఐ శిక్షణకు వాడుతున్నారంటూ ఇప్పటికే వెయ్యి మందికి పైగా ఉద్యోగులు ఒక పిటిషన్‌పై సంతకం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Meta Employee
Meta layoffs
AI tool
artificial intelligence
Mark Zuckerberg
AI week
tech industry
Julian
Janelle Gale
job termination

More Telugu News