పాకిస్థాన్ ఐఎస్ఐ కొత్త అస్త్రం ఇతడేనా?

Shahzad Bhatti ISIs New Weapon Against India
  • ఢిల్లీలో భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసిన పోలీసులు
  • పాకిస్థాన్ ఆపరేటివ్ షాజాద్ భట్టి నెట్‌వర్క్‌కు చెందిన 9 మంది అరెస్ట్
  • నిందితుల నుంచి పాక్ నిర్మిత గ్రెనేడ్లు, పిస్టళ్లు స్వాధీనం
  • సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించి దాడులకు ప్లాన్
  • ఐఎస్ఐ అండతో పనిచేస్తున్నట్లు భారత ఏజెన్సీల ఆరోపణలు
భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తోందా? సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ముసుగులో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ, దాడులకు కుట్రలు పన్నుతున్న పాకిస్థానీ షాజాద్ భట్టి కార్యకలాపాలు చూస్తుంటే అవుననే అంటున్నాయి భారత భద్రతా ఏజెన్సీలు. ఒకప్పుడు సోషల్ మీడియా స్టార్‌గా ఉండి, ఇప్పుడు ఐఎస్ఐ ఆపరేటివ్‌గా మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భట్టి, పాక్ కొత్త వ్యూహంలో కీలక పాత్రధారిగా మారాడని అధికారులు అనుమానిస్తున్నారు.

తాజాగా మే 30, 31 తేదీల్లో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్... భట్టికి చెందిన నెట్‌వర్క్‌పై భారీ ఆపరేషన్ నిర్వహించింది. 8 నుంచి 9 మంది అనుమానితులను అరెస్ట్ చేసింది. వీరి నుంచి పాకిస్థాన్‌లో తయారైన 4 హ్యాండ్ గ్రెనేడ్లు, 2 గ్లాక్ పిస్టళ్లు, 24 రౌండ్ల తూటాలు, దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని ఒక చారిత్రక ఆలయం, సోనిపట్ హైవేపై ఉన్న దాబా, హరియాణాలోని హిసార్ సైనిక శిబిరంపై దాడికి వీరు ప్లాన్ చేసినట్టు విచారణలో తేలింది.

ఎవరీ షాజాద్ భట్టి?

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన భట్టి, '333' అనే హ్యాండిల్‌తో సోషల్ మీడియాలో గుర్తింపు పొందాడు. భారత్-పాక్ సంబంధాలు, మతపరమైన అంశాలపై పోస్టులు పెడుతూ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. అయితే, 2013లోనే ఇతనిపై పాక్‌లో దొంగతనం, దోపిడీ, అత్యాచారం వంటి కేసులున్నాయి. 2015లో దుబాయ్ పారిపోయి, అక్కడ ఐఎస్ఐ హ్యాండ్లర్లయిన అబిద్ జాట్, అజ్మల్ గుజ్జర్ వంటి వారితో సంబంధాలు ఏర్పరుచుకున్నట్టు ఏజెన్సీలు గుర్తించాయి.

డబ్బు, కీర్తి ప్రతిష్ఠల ఆశ చూపి సోషల్ మీడియా ద్వారానే యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం, ఆయుధాలు సరఫరా చేయడం, దేశంలో అశాంతి సృష్టించడం ఇతని నెట్‌వర్క్ ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోనూ భట్టి నెట్‌వర్క్‌కు చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. ఎన్సీపీ నేత హత్య కేసు దర్యాప్తులోనూ ఇతని పేరు వినిపించింది. జమ్మూకశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్.. నార్కో టెర్రర్ కార్యకలాపాలపై భట్టిని బహిరంగంగానే హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న భట్టి కోసం ఎన్ఐఏ సహా పలు ఏజెన్సీలు గాలిస్తున్నాయి.
Go Back to Shorts
Shahzad Bhatti
ISI
Pakistan
Terrorism
India
Social Media Influencer
Delhi Police
NIA
Narco Terrorism
Abid Jat

More Telugu News