ఐపీఎల్-2026 ఫైనల్: ఆర్సీబీ ధాటికి గుజరాత్ విలవిల... 99 పరుగులకే 5 వికెట్లు డౌన్

RCB Dominates Gujarat Titans in IPL 2026 Final
  • ఐపీఎల్ 2026 ఫైనల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • మోదీ స్టేడియంలో ఆర్సీబీ బౌలర్ల జోరు
  • గుజరాత్ కీలక బ్యాటర్లు గిల్, బట్లర్, సాయి సుదర్శన్ విఫలం
  • 14.1 ఓవర్లలో 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన గుజరాత్
  • రెండు వికెట్లతో చెలరేగిన పేసర్ జోష్ హేజిల్‌వుడ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ టైటిల్ సమరంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. గుజరాత్ టైటాన్స్ (జీటీ) బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్‌ టాపార్డర్ ను కుప్పకూల్చింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ 14.1 ఓవర్లలో 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆట ఆరంభం నుంచే ఆర్సీబీ బౌలర్లు గుజరాత్ బ్యాటర్లపై నిప్పులు చెరిగారు. పేసర్ జోష్ హేజిల్‌వుడ్.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10)ను పెవిలియన్‌కు పంపగా, మరో కీలక బ్యాటర్ సాయి సుదర్శన్ (12)ను భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. దీంతో పవర్‌ప్లేలోనే గుజరాత్ రెండు ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన నిశాంత్ సింధు (20)ను రసిఖ్ సలామ్ దార్ ఔట్ చేయడంతో జీటీ మరింత ఒత్తిడిలో పడింది.

క్రీజులో కుదురుకుంటున్న ప్రమాదకర బ్యాటర్ జోస్ బట్లర్ (19)ను కృనాల్ పాండ్య అద్భుతమైన బంతితో అవుట్ చేశాడు. ఈ స్టంపౌట్ ఇన్నింగ్స్ కే టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అర్షద్ ఖాన్ (6 బంతుల్లో 15) రెండు భారీ సిక్సర్లతో మెరుపులు మెరిపించినా, అతడిని కూడా హేజల్‌వుడ్ ఔట్ చేయడంతో గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది.

ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ (19), రాహుల్ తెవాటియా క్రీజులో ఉండగా.. ఆర్సీబీ బౌలర్ల ధాటికి గుజరాత్ కనీసం పోరాడే స్కోరు చేస్తుందా అనేది అనుమానంగా మారింది. హేజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్, కృనాల్, రసిఖ్ తలా ఒక వికెట్ తీసుకుని ఆర్సీబీని పటిష్ట స్థితిలో నిలిపారు.
Go Back to Shorts
RCB
Royal Challengers Bangalore
Gujarat Titans
IPL 2026
Josh Hazlewood
Shubman Gill
Narendra Modi Stadium
Indian Premier League
Cricket
Final Match

More Telugu News