కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టేసినట్టే... మెజారిటీని దాటిన ఆప్ ఆధిక్యం!

  • 63 స్థానాల్లో వెలువడిన ట్రెండ్స్
  • 48 చోట్ల ఆధిక్యంలో ఆప్
  • 14 చోట్ల ఆధిక్యంలో బీజేపీ
70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాల ప్రకారమే, మెజారిటీకి చేరువవుతోంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, ఇప్పటివరకూ 63 నియోజకవర్గాల ట్రెండ్స్ బయటకు వచ్చాయి. ఆప్ 48 చోట్ల ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 14 స్థానాల్లో, ఇతరులు 1 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. 36 సీట్లలో గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండగా, ఇప్పటికే ఆప్ ఆ సంఖ్యను దాటేసింది.

న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్, ప్రతాప్ గంజ్ లో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, షాకుర్ బస్తీ నుంచి మంత్రి సత్యేంద్ర జైన్ ఆధిక్యంలో ఉండగా, రోహిణి నియోజకవర్గంలో బీజేపీ నేత విజయేంద్ర కుమార్ ముందంజలో ఉన్నారు. చాందినీ చౌక్ లో కాంగ్రెస్ అభ్యర్థిని అల్కా లాంబా వెనుకంజలో ఉన్నారు. సెంట్రల్ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకపక్ష విజయం దిశగా సాగుతుండగా, వాయవ్య ఢిల్లీలో మాత్రం బీజేపీ తన బలాన్ని ప్రదర్శిస్తోంది. కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఫలితాల సరళి తెలియజేస్తూ ఉండటంతో ఆప్ కార్యాలయాల వద్ద సంబరాలు మొదలయ్యాయి.


More Telugu News