గుంటూరులోని భజరంగ్ జూట్ మిల్లు కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: మంత్రి వెల్లంపల్లి

  • కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాం
  • గత నెలలో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశాం
  • వారం రోజుల్లోగా ఓ నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించాం
గుంటూరులోని భజరంగ్ జూట్ మిల్లు కార్మికుల సమస్యల శాశ్వత పరిష్కారానికి, వారికి న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో గుంటూరు జిల్లా కలెక్టరు, కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్టుమెంట్, జాయింట్ సెక్రెటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ తదితర అధికారులతో మంత్రి ఇవాళ సమావేశం నిర్వహించారు.

అందరితో చర్చించి, రాజకీయాలకు తావులేకుండా నిష్పక్షపాతంగా కార్మికులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లంపల్లి చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భజరంగ్ జూట్ మిల్లు కార్మికుల విషయంలో న్యాయం జరగలేదని, కార్మికుల అభ్యర్థన మేరకు తమ ప్రభుత్వం  అందరికీ న్యాయం చేసేందుకు చర్యలు ప్రారంభించిందని అన్నారు.

ఈ విషయమై సీఎం జగన్ గత నెలలో తన అధ్యక్షతన నలుగురు సభ్యులతో కూడిన హై లెవెల్ కమిటీని నియమించిన విషయాన్ని ప్రస్తావించారు. జూట్ మిల్లుకు చెందిన యాజమాన్యం, కార్మికులతో  కలెక్టర్ చర్చించి వారం రోజుల్లోగా హైలెవెల్ కమిటీకి ఓ నివేదిక సమర్పించాలని ఆదేశించారు.


More Telugu News