కారుతో ఢీ కొట్టి పారిపోదామనుకున్నాడు... ఆధునిక టెక్నాలజీతో చిక్కాడు!
- ప్రమాదంలో ఘటనా స్థలిలో మృతి చెందిన మహిళ
- కారకులెవరన్న దానిపై లభించని ఆధారాలు
- సీసీ కెమెరాల పుటేజీలో వాహనం గుర్తింపు
మద్యం మత్తులో ఉన్నాడో...మరో కారణమోగాని వంద కిలోమీటర్ల వేగంతో కారులో వెళుతూ ఓ మహిళను ఢీ కొట్టాడు. ఆమెకు ఏమయ్యిందో కూడా చూడకుండా పారిపోయాడు. సదరు మహిళ ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఒక్క ఆధారం దొరక్కపోవడంతో తప్పించుకోగలననుకున్నాడు. సీసీ కెమెరాల పుటేజీల్లో లభించిన చిన్న ఆధారంతో గురుడి ఆచూకీ చిక్కింది.
పోలీసుల కథనం మేరకు... జనవరి 31 తెల్లవారు జామున 5.45 గంటల సమయం. హబ్సిగూడ-ఉప్పల్ ప్రధాన రహదారిలో ఐసీఐసీఐ బ్యాంకు ఎదుట వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టిన ప్రమాదంలో కల్యాణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనానంతరం వాహనం వెళ్లిపోవడం, ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది.
సీసీ కెమెరాల పుట్టేజీయే ఏకైక ఆధారం అనుకున్న పోలీసులు ఆ మార్గాన్ని కలుపుతూ పోయే పలు రోడ్లలో పుటేజీని పరిశీలించారు. ఓ దారిలో పార్కింగ్ లైట్లు వేసుకుని వంద కిలోమీటర్ల వేగంతో ఓ నల్లరంగు కారు ప్రయాణిస్తుండడాన్ని గుర్తించారు. వివిధ ప్రాంతాల్లోని ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్ననైజేషన్ టెక్నాలజీ (ఏఎన్పీఆర్) కెమెరాలను పరిశీలించారు.
ఇవి రాత్రిపూట కూడా అతివేగంగా వెళ్లే వాహనాల నంబర్‌ను గుర్తిస్తాయి. అలా రెండువేల వాహనాల నంబర్లను పరిశీలించి ఎట్టకేలకు నిందితుడి వాహనాన్ని గుర్తించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సందీప్ మాదాపూర్ నుంచి వస్తూ మహిళను ఢీకొట్టాడని నిర్ధారణకు వచ్చారు. దీంతో కారుతోపాటు సందీప్ ను అదుపులోకి తీసుకున్నారు.