'కరోనా' వైరస్ కాదు.. మాంసాహారులకు మృత్యు సందేశమివ్వడానికి దేవుడెత్తిన కోపావతారం: హిందూ మహాసభ

  • స్వామి చక్రపాణి విచిత్ర వ్యాఖ్యలు
  • మనుషులను శాకాహారులుగా మార్చాలని గుణపాఠం చెప్పడానికి అవతారం
  • చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌.. 'కరోనా' విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
  • క్షమాపణలు అడిగితే కోపావతారం శాంతిస్తుంది
కరోనా జాతికి చెందిన కొవిడ్‌-19 వైరస్‌.. చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అయితే, మాంసాహారులను దండించడానికి దేవుడు ధరించిన కోపావతారమే కరోనా వైరస్ అని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి వ్యాఖ్యానించారు.

తాజాగా ఓ సభలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'కరోనా అంటే వైరస్ కాదు.. అది ఓ అవతారం.. మూగ జీవులను రక్షించడానికి దేవుడు ఎత్తిన కోపావతారం. మాంసాహారులకు మృత్యుసందేశం ఇవ్వడానికి, శిక్షించడానికే కరోనా ఉద్భవించింది' అంటూ హిరణ్యకశిపుడిని చంపడానికి వచ్చిన నృసింహ స్వామి అవతారాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

'మూగ జీవులను హింసించకూడదని, మనుషులను శాకాహారులుగా మార్చాలని చైనీయులకు గుణపాఠం చెప్పడానికి దేవుడు కరోనా అవతారం ఎత్తాడు' అని వ్యాఖ్యానించారు.  చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌.. 'కరోనా' విగ్రహాన్ని ఏర్పాటు చేసి, క్షమాపణలు అడగాలని అన్నారు.

అలాగే, భవిష్యత్తులో మరెన్నడూ మూగజీవులకు హాని చేయబోమని మాంసాహార చైనీయులు ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. ఇలా చేస్తే కరోనా కోపం తగ్గుతుందని, దేవుడు శాంతి స్వరూపుడవుతాడని చెప్పారు. దేవుడిని ఆరాధించే, గోవులను రక్షించే భారతీయులకు కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని దేవుడు ఇచ్చాడని అందుకే ఇక్కడ అది విజృంభించట్లేదని తెలిపారు. 


More Telugu News