హీరోయిన్ త్రిషకు వార్నింగ్ ఇచ్చిన తమిళ నిర్మాతల మండలి!

  • త్రిష కొత్త చిత్రం 'పరమపదం విళైయాట్టు'
  • ప్రమోషన్ కు రాని హీరోయిన్
  • సగం పారితోషికం ఇవ్వాల్సి ఉంటుందన్న నిర్మాతల మండలి
ఇటీవల దర్శక నిర్మాత తిరుజ్ఞానం తెరకెక్కించిన 'పరమపదం విళైయాట్టు' చిత్రంలో నటించిన త్రిష, ఆ సినిమా ప్రమోషన్ కోసం హాజరు కాకపోవడంపై తమిళ నిర్మాతల మండలి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, హెచ్చరికలు జారీ చేసింది. ఈ చిత్రం 28న విడుదల కానుండగా, నిన్న చెన్నైలోని సత్యం థియేటర్ లో యూనిట్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో నటుడు భాగ్యరాజా, నిర్మాతల మండలి నుంచి టీ శివ, కే రాజన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి త్రిష హాజరు కాలేదు. సినిమాలో త్రిషే ప్రధాన పాత్రధారి కావడంతో పలువురు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని అల్టిమేట్టం జారీ చేసిన శివ, ఒకవేళ రాకుంటే, తీసుకున్న పారితోషికంలో సగం చెల్లించాల్సి వుంటుందని హెచ్చరించారు. లేకుంటే తమిళ చిత్రాల్లో నటించకుండా నిషేధం విధిస్తామని ఆయన అన్నారు.

రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ వంటి హీరోలే తమ చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని, అటువంటిది హీరోయిన్లు మాత్రం ఎందుకు రావడం లేదో తెలియదని, ఇదే పరిస్థితి కొనసాగితే తాము కొత్త వారితో సినిమాలు తీయాల్సి వస్తుందని అన్నారు.


More Telugu News