ఢిల్లీ అల్లర్లపై పోలీసుల తీరును తప్పుబట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ ఆకస్మిక బదిలీ!

  • అర్ధరాత్రి పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ మురళీధర్‌
  • అల్లర్ల సందర్భంగా పోలీసుల తీరును తప్పుపట్టిన వైనం
  • తీర్పు వెలువరించి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే బదిలీ
దేశ రాజధాని ఈశాన్య ఢిల్లీ అల్లర్లతో అట్టుడుకుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అల్లర్ల నేపధ్యంలో పోలీసుల తీరును తప్పుబడుతూ నమోదైన పిటిషన్లను అర్ధరాత్రి విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మురళీధర్‌పై బదిలీ వేటు పడింది. అల్లర్ల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును న్యాయమూర్తి తప్పుపట్టారు. అయితే ఉదయానికల్లా జస్టిస్‌ మురళీధర్‌ బదిలీ ఉత్తర్వు ప్రకటన వెలువడడం గనార్హం.

ఆయనను పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ గెజిట్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తక్షణం సంతకం చేయడం, ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశం అయ్యింది.

మురళీధర్‌ బదిలీ వ్యవహారంపై కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. వాస్తవానికి ఈనెల 12వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం ఆయన బదిలీకి ప్రతిపాదించగా, దీన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అప్పటి నుంచి ఆందోళన చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ అల్లర్లపై దాఖలైన పిటిషన్లను మురళీధర్‌ అర్ధరాత్రి తన ఇంట్లోనే విచారించి పోలీసుల తీరును తప్పుపట్టారు. ఒక వర్గాన్ని సురక్షితంగా ఆసుపత్రులకు తరలించడాన్ని అడ్డుకోవద్దంటూ పోలీసులను హెచ్చరిస్తూ మూడు పేజీల తీర్పు పాఠాన్ని వినిపించారు. ఈ విచారణ జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మురళీదర్‌పై బదిలీ వేటు పడడం చర్చనీయాంశంగా మారింది.


More Telugu News