చైనా పరికరం ఒక్కటి కూడా వాడకుండా 5జీ నెట్ వర్క్ తెస్తున్నం.. ట్రంప్ కు చెప్పిన ముఖేష్ అంబానీ
- ప్రపంచంలో చైనా పరికరాలు వాడని ఒకే ఒక్క 5జీ నెట్ వర్క్ తమదేనన్న అంబానీ
- చైనా తమ కంపెనీల పరికరాలతో నిఘా పెడుతోందన్న ఆందోళన
- రిలయన్స్ జియో నెట్ వర్క్ లో వాడుతున్నవి సామ్ సంగ్ పరికరాలు
చైనాకు చెందిన ఒక్క పార్టు, పరికరం వాడకుండా 5జీ నెట్ వర్క్ ను తెస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చెప్పారు. అంతేకాదు ప్రపంచం మొత్తంలో చైనా పరికరాలు వాడని ఏకైక 5జీ నెట్ వర్క్ రిలయన్స్ జియో నేనని వివరించారు. అమెరికా అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఢిల్లీలో జరిగిన భేటీలో..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ఈ నెల 24, 25 తేదీల్లో ఇండియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పర్యటించిన ట్రంప్.. మంగళవారం (25వ తేదీన) ఢిల్లీలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ తో అంబానీ మాట్లాడారు. మొదట ట్రంప్ అంబానీతో మాట్లాడుతూ.. ‘‘మీరు ఇప్పటికే 4జీ నెట్ వర్క్ అందిస్తున్నారు. 5జీ నెట్ వర్క్ ను కూడా మొదలుపెడుతున్నారా?” అని అడిగారు. దానిపై అంబానీ స్పందిస్తూ.. ‘‘అవును. మేం త్వరలోనే 5జీ నెట్ వర్క్ కు వెళుతున్నాం. ప్రపంచం మొత్తంలో చైనాకు చెందిన ఒక్క పరికరం, స్పేర్ పార్ట్ వాడకుండా ఉన్న ఏకైక నెట్ వర్క్ మాదే..” అని బదులిచ్చారు.చైనా పరికరాలతో నిఘా పెడుతోందన్న ఆందోళన
తమ దేశానికి చెందిన హువే, జెడ్ టీఈ కంపెనీల పరికరాలతో చైనా విదేశాలపై నిఘా పెడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. అమెరికా ఈ విషయంపై చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా అత్యాధునికమైన, అత్యంత వేగమైన 5జీ నెట్ వర్క్ పరికరాలు నిఘాకు తోడ్పడుతున్నాయని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ చైనా కంపెనీల పరికరాలను వాడొద్దంటూ తమ మిత్ర దేశాలపై ఒత్తిడి తెస్తోంది.జియో నెట్ వర్క్ లో సామ్ సంగ్ పరికరాలు
ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, తైవాన్ తదితర దేశాలు హువే, జెడ్ టీఈ 5జీ పరికరాలను నిషేధించాయి. బ్రిటన్ కూడా ప్రధాన పరికరాలపై నిషేధం విధించింది. తాజాగా ట్రంప్ పర్యటన సమయంలో 5జీ విషయాన్ని ప్రస్తావించడం, తాము చైనా పరికరాలేవీ వాడకుండా నెట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖేష్ అంబానీ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.- రిలయన్స్ జియో కంపెనీ దక్షిణ కొరియాకు చెందిన సామ్ సంగ్ సంస్థకు చెందిన 4జీ, 5జీ నెట్ వర్క్ పరికరాలు, స్పేర్ పార్టులను వాడుతోంది.
- అయితే భారత ప్రభుత్వం మాత్రం ఇండియాలో 5జీ నెట్ వర్క్ ట్రయల్స్ కోసం హువే, జెడ్ టీఈ కంపెనీలను ఇప్పటికే అనుమతించింది.