జగన్ ‘పోలవరం’ పర్యటనతో రూ.500 కోట్ల కుంభకోణానికి తెరలేపారు: దేవినేని ఉమ ఆరోపణలు

  • ఇసుక, ఇతర పనులను ఒకే సంస్థకు కట్టబెట్టాలని చూస్తున్నారు
  • అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకే జగన్ క్షేత్ర స్థాయి పరిశీలన
  • ‘పోలవరం’లో జరిగిన పనులు చూశాకా జగన్ నోరు మెదపట్లేదు
ఏపీ సీఏం జగన్ ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. ఈ రోజు శుక్రవారం కనుక కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకునేందుకే ‘పోలవరం’ పర్యటనకు వెళ్లారని విమర్శించారు. ఈరోజు పర్యటన ద్వారా రూ.500 కోట్ల కుంభకోణానికి ఆయన తెరలేపారని సంచలన ఆరోపణలు చేశారు. ఇసుక, ఇతర పనులను ఒకే సంస్థకు కట్టబెట్టేందుకు, అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకే జగన్ క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లారని ఆరోపించారు.

‘పోలవరం’లో జరిగిన పనులు చూశాక జగన్ నోరు మెదపలేకపోయారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ పనికిమాలిన ఓ నివేదికను ఢిల్లీలో ఇచ్చారని, రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డీపీఆర్–2 ఎందుకు క్లియర్ చేసుకోవడం లేదో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పునాదుల్లేని పోలవరం ప్రాజెక్టు 2021కి ఎలా పూర్తవుతుంది? అని ప్రశ్నించారు. సీఎం చెప్పిందల్లా చేసే ముందు అధికారులు గతం గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ అలసత్వం వల్ల ‘పోలవరం’పై రూ.2500 కోట్ల అదనపు భారం పడిందని ధ్వజమెత్తారు.


More Telugu News