'కేజీఎఫ్' హీరో యశ్ హత్యకు కుట్ర... నిందితుడిని ఎన్ కౌంటర్ లో కాల్చిచంపిన పోలీసులు!

  • యూపీలో భరత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లగా పారిపోయే ప్రయత్నం
  • ఛేజ్ చేసి కాల్చి చంపిన పోలీసులు
'కేజీఎఫ్' చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరును సంపాదించుకున్న కన్నడ స్టార్ యశ్ హత్యకు కుట్ర చేసిన భరత్ అలియాస్ స్లమ్ భరత్ అనే మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ ను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు. ఈ ఘటన కన్నడనాట తీవ్ర కలకలం రేపింది. గడచిన ఏడాదిగా యశ్ ను హత్య చేసేందుకు భరత్ ప్లాన్ చేస్తుండడంతో, తన ప్లాన్ ను అమలు చేయకముందే పోలీసులు దాన్ని భగ్నం చేశారు.

కాగా, భరత్ పై ఓ మర్డర్ కేసు సహా 50కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల అతన్ని యూపీలో అరెస్ట్ చేసిన పోలీసులు, కర్ణాటకకు తీసుకుని వచ్చి, ఓ సీన్ రీ కన్ స్ట్రక్షన్ నిమిత్తం బయటకు తీసుకెళ్లిన వేళ, పోలీసులపై అతను దాడికి దిగాడని, దీంతో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనలో భరత్, ఓ పోలీసు వద్ద రివాల్వర్ లాక్కుని కాల్పులు జరిపాడని, అయితే, పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడంతో ఎటువంటి హానీ జరుగలేదని, ఆపై భరత్ మరో వాహనంలో పారిపోతుండగా, ఛేజ్ చేసి ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని ఓ అధికారి వెల్లడించారు. తొలుత ఓ బుల్లెట్ ట్ కడుపులోకి, ఆపై మరో బుల్లెట్ కాలిలోకి దిగిందని, అతన్ని చికిత్స నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించినా, అప్పటికే పరిస్థితి విషమించి మరణించాడని అన్నారు.

యశ్ హత్యకు కుట్ర విషయానికి వస్తే, గత సంవత్సరంలో భరత్ తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ అనంతరం, అతను యశ్ హత్యకు కుట్ర పన్నినట్టు తెలిపారు. అయితే, ఇటువంటి వార్తలు తనను బాధిస్తున్నాయని అప్పట్లో యశ్ మీడియాకు వెల్లడించాడు. తనపై ఎటువంటి కుట్రలూ జరుగడం లేదని కూడా అన్నాడు. తనకు ఎలాంటి థ్రెట్స్ లేవని, ఈ విషయమై హోమ్ మంత్రితో పాటు, డీజీపీతోనూ మాట్లాడానని అన్నారు. తాజాగా, అదే క్రిమినల్ ఎన్ కౌంటర్ లో హతం అవడం గమనార్హం.


More Telugu News