చైనాలో కరోనా తగ్గి డిశ్చార్జ్ అయిన వారికి రెండోసారి సోకుతున్న వైరస్... తీవ్ర ఆందోళన!

  • రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన వైరస్
  • 60 దేశాలకు పైగా వ్యాప్తి
  • రెండోసారి వైరస్ సోకిన 10 మంది
  • భారీగా పెరుగుతున్న ఆర్థిక నష్టం
సుమారు రెండు నెలల క్రితం వూహాన్ ప్రావిన్స్ లో వెలుగులోకి వచ్చిన కరోనా (కొవిడ్ -19) వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని ఎంతగా ఆందోళనకు గురి చేస్తున్నదో అందరికీ తెలిసిందే. ఈ వైరస్ ఇప్పటికే 60 దేశాలకు పైగా వ్యాపించింది. వేలాది మందిని బలిగొంది. లక్షలాది మంది వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇప్పటికే సుమారు 350 లక్షల కోట్ల నష్టం సంభవించిందని అంచనా.

ఇప్పుడు కరోనా వైరస్ గురించి బయటకు వచ్చిన మరో వార్త తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. ఈ వైరస్ సోకి, చికిత్స తీసుకుని బయటకు వెళ్లిన వారికి తిరిగి వ్యాధి సోకుతోంది. డిశ్చార్జ్ అయిన వారు, రెండోసారి ఇన్ఫెక్షన్ కు గురై ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. చైనాలో ఇప్పటివరకూ ఇదే తరహా కేసులు 10 నమోదయ్యాయి. వీరందరూ వూహాన్ ప్రావిన్స్ పరిధిలోని వారే. దీంతో వూహన్ లో ప్రజల ఆందోళన మరింతగా పెరిగింది.

మరోవైపు చైనా తరువాత ఇరాన్ లో సైతం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఒక్క శనివారం నాడే 593 మందికి వైరస్ నిర్దారణ అయింది. కొన్ని వేల మంది వైరస్ లక్షణాలతో రక్త నమూనాలు ఇచ్చి వున్నారు. వారందరి రిపోర్టులూ రావాల్సి వుంది. ఇప్పటివరకూ ఇరాన్ లో 43 మంది మరణించినట్టు అధికారిక గణాంకాలు చెబుతుండగా, మృతుల సంఖ్య 200 దాటిందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి బీబీసీ వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు.

ఇక ఇరాన్ లో వ్యాధి సోకిన వారికి, మరణాలకు ఉన్న నిష్పత్తి చైనాతో పోలిస్తే 7 రెట్లు అధికంగా ఉంది. ఆపై ఇటలీని సైతం కరోనా వణికిస్తోంది. ఇటలీలో వ్యాధి సోకిన వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ వైరస్ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపింది. గడచిన వారం రోజుల్లో 3.18 లక్షల కోట్ల డాలర్ల మదుపరుల సంపద హారతి కర్పూరమైంది. ఇండియాలో శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్ లో దాదాపు ఐదున్నర లక్షల కోట్ల మార్కెట్ కాప్ నష్టం నమోదుకాగా, సోమవారం ఏం జరుగుతుందన్న టెన్షన్ నెలకొంది.


More Telugu News