గంగా నదిలో పుణ్యస్నానం చేసిన దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్

  • జాంటీ రోడ్స్ కు ఇండియా అంటే అమితమైన ఇష్టం
  • తన కుమార్తెకు కూడా ఇండియా అని పేరు పెట్టుకున్నారు
  • ఆధ్యాత్మికానికి భారత్ కేంద్ర బిందువని గతంలో చెప్పిన రోడ్స్
దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ పవిత్ర గంగా నదిలో పుణ్య స్నానమాచరించారు. రిషికేశ్ లో నిన్న స్నానం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయన తెలియజేశారు. పవిత్ర గంగా నదిలోని చల్లటి నీటిలో మునగడం వల్ల శారీరకంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా లాభాలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. మోక్ష, రిషికేశ్, ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ అనే హ్యాష్ ట్యాగులు కూడా పెట్టారు.

జాంటీ రోడ్స్ కు భారత్ అంటే అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఈ కారణంగానే 2016లో జన్మించిన తన కుమార్తెకు 'ఇండియా జియానే రోడ్స్' అని పేరు పెట్టారు.

గతంలో రోడ్స్ మాట్లాడుతూ, ఇండియాలో తాను ఎంతో కాలం గడిపానని చెప్పారు. అత్యున్నతమైన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం సమ్మిళమైన ఈ దేశమంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఆధ్యాత్మికానికి భారత్ కేంద్ర బిందువని చెప్పారు. ఇక్కడి వారి జీవితాలు సమతూకంతో, ప్రశాంతంగా ఉంటాయని అన్నారు. అందుకే తన కూతురుకి ఇండియా పేరు కలసి వచ్చేలా పేరు పెట్టానని చెప్పారు. ఇండియా జియానే రోడ్స్ పేరుతో తన కూతురు రెండు దేశాలకు అనుసంధానమై ఉంటుందని... ఆమె జీవితం సమతుల్యంగా ఉంటుందని అన్నారు.

జాంటీ రోడ్స్ ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కు ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు.


More Telugu News