మరో తొమ్మిది దేశాలకు విస్తరించిన కరోనా.. ఇటలీలో పరిస్థితి దారుణం
వంద దాటిపోయిన కరోనా ప్రభావిత దేశాల సంఖ్య
చైనా బయట వైరస్ వ్యాప్తి పెరుగుతోందన్న డబ్ల్యూహెచ్ వో
దక్షిణ కొరియాలోనూ ఏడు వేలకుపైగా కేసుల నమోదు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కొత్తగా మరో ఎనిమిది దేశాలకు వ్యాపించింది. మొత్తంగా కరోనా ప్రభావిత దేశాల జాబితా వందకు చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. ముఖ్యంగా చైనా బయట దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్ లలో పరిస్థితి దారుణంగా ఉందని.. ఇటలీలో అయితే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ప్రకటించింది.
కొత్త దేశాలేవి?
ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల్లోనే కొత్తగా తొమ్మిది దేశాల్లో కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ వో ప్రకటించింది. మాల్దీవులు, బల్గేరియా, అల్బేనియా, కోస్టారికా, ఫారో ఐలాండ్స్, ఫ్రెంచ్ గయానా, మాల్టా, మార్టినిక్, రిపబ్లిక్ ఆఫ్ మాల్డోవా దేశాల్లో కరోనా వైరస్ బాధితులను గుర్తించినట్టు తెలిపింది.
ఇటలీలో పరిస్థితి దారుణం
చైనా తర్వాత ప్రపంచంలో ఇటలీ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అతి ఎక్కువగా నమోదైంది. ఇటలీలో ఇప్పటివరకు ఏడు వేల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. ఆ దేశంలోని నాలుగో వంతు మందిని పూర్తిగా ఇండ్లలోనే ఉండాల్సింగా (సెల్ఫ్ క్వారంటైన్) ఆదేశించారు. అటు దక్షిణ కొరియాలోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆ దేశంలోనూ ఏడు వేల మందికి వైరస్ సోకింది.