బాధ్యత లేదా?... కేసులు పెట్టాలా?: లాక్ డౌన్ ని అతిక్రమిస్తున్న వారిపై హరీశ్ రావు ఆగ్రహం

  • సిద్దిపేటలో పర్యటించిన హరీశ్ రావు
  • లాక్ డౌన్ పట్టించుకోని వారికి క్లాస్
  • ప్రజలు సహకరించకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ, పట్టించుకోకుండా, రోడ్లపై తిరుగుతున్న వారిపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్న సిద్దిపేటలో హరీశ్ రావు పర్యటించగా, పలువురు తమ ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురితో కలిసి వెళుతుండటాన్ని గుర్తించి, వారిని ఆపారు. ఎంత బతిమిలాడి చెప్పినా అర్థం చేసుకోవట్లేదని మండిపడ్డారు.

"కరోనా వైరస్‌ కు మందే లేదు. స్వీయ నిర్బంధం, సామాజిక దూరం పాటించడమే మన ముందున్న సమస్యకు ఏకైక పరిష్కారం. ఈ వైరస్‌ ను చూసి ప్రపంచమే గడగడలాడుతోంది. మీరేమో పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు" అంటూ క్లాస్ పీకారు. వందలాది మంది అధికారులు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజల కోసం పని చేస్తుంటే, వారికి సహకరించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.

ప్రజలు తమ వైఖరిని మార్చుకోకపోతే కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కరోనా వ్యాధిని ఎదుర్కొనేందుకు సీఎం సహాయనిధికి దాతలు విరివిగా విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా హరీశ్ రావు కోరారు.


More Telugu News