కరోనా పేరిట విడదీసే కుట్ర... లాక్ డౌన్ ను ఉల్లంఘించాలని ముస్లింలకు పిలుపు: మర్కజ్ చీఫ్ ఆడియో టేపుల కలకలం!

  • 70 వేల మందిని అల్లా తీసుకెళ్లాడు
  • అల్లా తలిస్తే ఎవరైనా అడ్డుకోగలరా?
  • ముస్లింలను వేరు చేసే కుట్ర జరుగుతోంది
  • బయటకు వచ్చిన మౌలానా సాద్ ప్రసంగ ఆడియో
  • సాంకేతికంగా  ధృవీకరించబడని ఆడియో 
"70 వేల మందిని బలిగొన్న ఈ వ్యాధి నుంచి మనల్ని ఏ డాక్టరైనా కాపాడగలరా? చనిపోయిన వారందరినీ తాను చూసుకునేందుకే తీసుకెళ్లానని అల్లా చెబితే... ఈ ప్రపంచంలో మరే ఇతర శక్తి అయినా దీన్ని అడ్డుకోగలదా? భయాలను, అంటరానితనాన్ని వ్యాపింపజేసే సమయం ఇది కాదు. డాక్టర్లు చెప్పే మాటలను వినకండి. మీరంతా మీ ఇళ్లలోని ఆడవాళ్లను, పిల్లలను, జంతువులను తీసుకుని బయటకు రండి. గుర్తుంచుకోండి... అల్లా ఏదైనా తలిస్తే, దాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు" అంటూ న్యూఢిల్లీలో వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమైన మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ ప్రసంగిస్తున్నదిగా భావిస్తున్న  ఆడియో టేప్ ఒకటి బయటకు వచ్చి తీవ్ర కలకలం రేపింది. కాగా, ఈ ఆడియోలోని వాయిస్  సాంకేతికంగా  ధృవీకరించబడలేదు.
 
రిపబ్లిక్ టీవీ ఈ ఆడియోను  ప్రసారం చేసింది. సదరు చానల్ కథనం ప్రకారం, ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గాలో సాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలంతా లాక్ డౌన్ ను పాటించరాదని, కొవిడ్-19ను తరిమికొట్టాలంటే సామూహిక ప్రార్థనలు చేయాలని ఆయన సూచించారు. ముస్లింలను విడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని, దీన్ని అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

"మనమంతా కలిస్తే ఈ వ్యాధి వ్యాపిస్తుందని చెబితే, మీరు నమ్ముతున్నారా? అందరూ కలిసి అల్లా ప్రవచనాలను వ్యాపింపజేయాల్సిన సమయం ఇదే. ముస్లింలంతా ఒక చోట చేరడాన్ని తట్టుకోలేని వారి కుట్రే ఇది. ఇస్లాంను, ముస్లింలను, వారి మార్గాన్ని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోంది. జరుగుతున్న ప్రచారాన్ని ముస్లింలు నమ్మితే, మనలోని సోదరభావం చచ్చిపోతుంది. ఒకరి పక్కన ఒకరు కూర్చోవద్దని, ఒకే ప్లేటులో తినవద్దని చెబుతున్నారు. ముస్లింలలోని ఐక్యతను దెబ్బతీసే కుట్రే ఇదని అర్థం కావడం లేదా?" అని ఆయన ఆవేశంగా ప్రసంగించినట్టు ఆడియోలో స్పష్టమవుతోంది.

ఇక ఈ ఆడియో టేప్ వైరల్ కావడంతో, అధికారులు, పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇప్పటికే సాద్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. మర్కజ్ కు వచ్చిన వారి వివరాలు ఇవ్వడంలో ఆయన విఫలం అయ్యారన్న కోణంలో తొలి కేసు నమోదు కాగా, ఇప్పుడు విద్వేషపూరిత వ్యాఖ్యల కేసును ఆయనపై నమోదు చేయనున్నారని తెలుస్తోంది.




More Telugu News