కరోనా నివారణ చర్యల్లో దారుణంగా విఫలమవుతున్న పాకిస్థాన్

  • పాక్ లో పాక్షిక లాక్ డౌన్
  • అంతంతమాత్రంగా అమలవుతున్న ఆంక్షలు
  • అధికారుల మాటలు పెడచెవిన పెడుతున్న ప్రజలు
  • ఇప్పటికీ మసీదుల్లో ప్రార్థనలు
పాకిస్థాన్ లో కరోనా వ్యాప్తి క్రమంగా భీతావహ రూపు సంతరించుకుంటోంది. అక్కడ కొన్నిరోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఇప్పుడు పాకిస్థాన్ లో కరోనా బాధితుల సంఖ్య 2,238 కాగా, మరణాలు 31కి పెరిగాయి.

పూర్తిస్థాయి లాక్ డౌన్ ప్రకటించలేని నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉండగా, ప్రజలు ఆంక్షలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం రానున్న రోజుల్లో అక్కడి పరిస్థితి ఊహించని విధంగా మారొచ్చన్న అంచనాలకు బలం చేకూరుస్తోంది. పైగా ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాల లేమి తీవ్రంగా ఉంది. తగినంత స్థాయిలో స్క్రీనింగ్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం పాక్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.

పాక్షిక లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కేసులు రెట్టింపయ్యాయి. మరికొన్నిరోజుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగనుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం పాక్ లో పరిస్థితి ఎలా ఉందంటే... అధికారులు చెప్పే సూచనలను ప్రజలు తలకెక్కించుకోవడంలేదు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలి, అత్యవసర సమయాల్లోనే బయటికి రావాలి అని అధికార వర్గాలు మొత్తుకుంటున్నా, రోడ్లపై యథేచ్చగా సంచరిస్తున్న పరిస్థితి పాక్ లోని ప్రతి నగరంలో కనిపిస్తోంది.

దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా మసీదులు ఇప్పటికీ మూతపడలేదు. ఇప్పటికే ఇరాన్, సౌదీ అరేబియా మసీదులను మూసివేసినా, పాక్ లో మసీదుల్లో ఇప్పటికీ ప్రార్థనలు జరుగుతున్నాయి.  గత నెలలో పాకిస్థాన్ లో జరిగిన ఓ కార్యక్రమానికి 2.50 లక్షల మంది హాజరయ్యారని అంచనా. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరైన వారి వివరాలు తెలుసుకోవడం పట్ల పాక్ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి కనబర్చుతోంది.


More Telugu News