ఎయిర్‌టెల్‌, వొడా ఫోన్‌ వినియోగదారులకు శుభవార్త: ఏటీఎంల్లో రీచార్జి సదుపాయం!

  • ఎంపిక చేసిన షాపుల్లోనూ అవకాశం
  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెండు సంస్థల నిర్ణయం
  • ఇప్పటికే జియో ఈ దిశగా అడుగులు
లాక్‌డౌన్‌ కారణంగా రీచార్జి చేసుకునే అవకాశం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వినియోగదారులకు ఆయా సంస్థల యాజమాన్యాలు తీపికబురు అందించాయి. ఇకపై ఏటీఎంల్లో ఎంచక్కా రీచార్జి చేసుకోవచ్చని తెలిపాయి.

ఇప్పటి వరకు జియో ఇలాంటి అవకాశం కల్పించగా తాజాగా ఈ రెండు సంస్థలు కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించాయి. వినియోగదారులు ఏటీఎంకు వెళ్లి కార్డు పెట్టాక తెరపై కనిపించే మొబైల్‌ కంపెనీని ఎంపిక చేసుకోవాలి. రీచార్జి చేయదలచిన మొబైల్‌ నంబర్‌, అమౌంట్‌ నమోదు చేయాలి. పిన్‌ ఎంటర్‌ చేస్తే రీచార్జి పూర్తయిన సమాచారం వస్తుందని ఈ సంస్థలు తెలిపాయి.

ఆన్‌లైన్‌లో రీచార్జి చేసుకోలేని వారికి మాత్రమే ఏటీఎంలో రీచార్జి జరుగుతుంది. దీనికి అదనంగా ఎంపిక చేసిన కొన్ని కిరాణా, ఫార్మసీ దుకాణాల్లో కూడా రీచార్జి చేసుకునే సదుపాయం కల్పించినట్టు పేర్కొన్నాయి. మరోవైపు ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా రీచార్జి చేసుకోవచ్చని వొడాఫోన్‌ ఐడీయా తెలిపింది.

దీనికి మీ నంబర్‌ నుంచి ఐడీయా/వొడాఫోన్‌ నంబరు టైప్‌చేసి స్పేస్‌ ఇచ్చి రీచార్జి సొమ్ము టైప్‌చేసి స్పేస్‌ ఇచ్చి ఐసీఐసీఐ లేదా యాక్సిస్ బ్యాంక్ ఖాతా చివరి ఆరు అంకెలను నమోదు చేసి 9717000002 లేదా 5676782కు ఎస్ఎంఎస్ పంపితే రీచార్జి పూర్తవుతుంది.


More Telugu News