టీమిండియా ముందు మా వాళ్లు సాగిలపడ్డారు.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

  •  ఐపీఎల్ కాంట్రాక్టులు కాపాడుకునేందుకు ఇండియన్స్‌తో రాజీ పడ్డారు
  • కోహ్లీతో పెట్టుకునేందుకు భయపడ్డారు
  • ఇతర దేశాల క్రికెటర్లదీ అదే దారి: క్లార్క్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తమ దేశ క్రికెటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కాంట్రాక్టులు కాపాడుకోవడం కోసం టీమిండియా ముందు సాగిల పడ్డారని అన్నాడు. భారత క్రికెటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారని చెప్పాడు. అలాగే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయాలంటే భయపడ్డారని పేర్కొన్నాడు.

ఆసీస్‌తో పాటు ఇతర దేశాల క్రికెటర్లు కూడా ఐపీఎల్‌ను దృష్టిలో ఉంచుకొని టీమిండియా ప్లేయర్లతో చాలా మర్యాదగా నడుచుకున్నారన్నాడు. ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన పలువురు క్రికెటర్లు భారీ ధరకు అమ్ముడైన తర్వాత క్లార్క్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘ఈ ఆటలో అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా ఐపీఎల్ తో దేశవాళీలో ఆర్థిక పరంగా భారత్ ఎంత బలమైనదో అందరికీ తెలుసు. కొంతకాలంగా ఆస్ట్రేలియాతో పాటు ఇతర జట్ల ఆటగాళ్లు కూడా భారత జట్టు ముందు సాగిలపడ్డారని నేను భావిస్తున్నా. కోహ్లీ లేదా ఇతర ఇండియన్ ప్లేయర్లను స్లెడ్జింగ్ చేసేందుకు వాళ్లు చాలా భయపడ్డారు. ఎందుకంటే మళ్లీ వాళ్లతోనే ఏప్రిల్‌లో ఐపీఎల్‌లో ఉంటుంది కదా. ఐపీఎల్‌ టీమ్‌లో చోటు ఆశించే పది మంది ఆస్ట్రేలియా క్రికెటర్లను తీసుకోండి. అప్పుడు వాళ్లు ‘‘మేం కోహ్లీని అస్సలు కవ్వించం. అతను నన్ను బెంగళూరు జట్టులోకి తీసుకోవాలని ఆశిస్తున్నా. అప్పుడు ఆరు వారాల్లోనే ఓ మిలియన్ యూఎస్ డాలర్లు ఖాతాలో వేసుకుంటా” అంటారు. ఈ విధంగా కొంతకాలం పాటు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వ్యవహారశైలి కొంత సున్నితంగా మారింది. సాధారణంగా అయితే మా జట్టు కాస్త కఠినంగానే ఉంటుంది’ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు.


More Telugu News