పూర్తిగా స్తంభించిన గుంటూరు!

  • గుంటూరులో 50 దాటిన కేసులు
  • కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్న అధికారులు
  • ఇకపై రోజు విడిచి రోజు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50ని దాటడంతో, అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఉదయం నుంచి పూర్తి లాక్ డౌన్ మొదలైంది. నగర పరిధిలో నిన్నటివరకూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ ప్రజలు నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించగా,  నేడు దాన్ని కూడా తొలగించి, నగరాన్ని దిగ్బంధించారు. కేవలం మెడికల్ షాపులు, ఆసుపత్రులు మాత్రమే తెరచి వుంటాయని అధికారులు స్పష్టం చేశారు.

సోమవారం ఉదయం కూరగాయలు, నిత్యావసరాల మార్కెట్లు మాత్రమే తెరచుకుంటాయని, ఆపై రోజు విడిచి రోజు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేయాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. కూరగాయలు, నిత్యావసరాల నిమిత్తం బయటకు వచ్చేవారు, అడ్రస్ ప్రూఫ్ ను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, ఇంటి నుంచి ఒక్క కిలోమీటర్ దూరం వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని, పరిధి దాటితే, వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు కనీసం రెండు వారాలకు సరిపడా నిత్యావసరాలు కొనుగోలు చేయాలని, కూరగాయలు కూడా వారానికి ఒకసారి కొనుగోలు చేయాలని అధికారులు సలహా ఇస్తున్నారు.

ఇక ఈ ఉదయం గుంటూరులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను అధికారులు మూసివేశారు. దీంతో బ్రాడీపేట, అరండల్ పేట ప్రాంతానికి, హిందూ కాలేజ్ సెంటర్ కు మధ్య సంబంధాలు తెగిపోయాయి. బస్టాండ్ సమీపంలోని ఫ్లై ఓవర్ ను మూసివేయడంతో రహదారులపై వాహనాలే కనిపించని పరిస్థితి నెలకొంది. ఉదయం పూట కూరగాయలను అమ్ముకునేందుకు ఎంతో ప్రయాసపడి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన చిరు వ్యాపారులు మార్కెట్ ను తెరిచేందుకు వీల్లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఉసూరుమన్నారు.


More Telugu News