అనారోగ్యంతో వున్న తనయుడిని చూడడం కోసం... 2,700 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తల్లి!

  • రాజస్థాన్ లో బీఎస్ఎఫ్ జవానుగా పనిచేస్తున్న అరుణ్
  • కండరాల వ్యాధితో బాధపడుతూ ఉండటంతో వెళ్లాలని భావించిన తల్లి
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రయాణం
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతూ ఉన్న వేళ, కేరళకు చెందిన ఓ మహిళ, రాజస్థాన్ లో అనారోగ్యంతో ఉన్న తన కుమారుడిని ఎలాగైనా కలవాలన్న ఉద్దేశంతో, కారులో 2,700 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించింది. ఈ ప్రయాణంలో ఆమెకు తోడుగా కోడలు, మరో వ్యక్తి ఉండగా, ఆమె ప్రయాణానికి ఆరు రాష్ట్రాల పోలీసులు, కేరళ ప్రభుత్వం, కేంద్రం కూడా సహకరించింది.

వివరాల్లోకి వెళితే, జోధ్ పూర్ లో అరుణ్ కుమార్ (29) అనే బీఎస్ఎఫ్ జవాను అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. కేరళలోని కొట్టాయం ప్రాంతంలో అతని తల్లి షీలమ్మా వాసన్ ఉంటోంది. జోధ్ పూర్ లోని ఎయిమ్స్ వైద్యుల నుంచి ఆమెకు అరుణ్ కుమార్ అనారోగ్యంపై సమాచారం రావడంతో, వెంటనే బిడ్డ వద్దకు వెళ్లాలని భావించింది. కేరళ నుంచి బయలుదేరి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ల మీదుగా ప్రయాణించి, రాజస్థాన్ చేరుకుంది.

ఈ ప్రయాణంలో ఆమెకు కేంద్ర మంత్రి మురళీధరన్, కేరళ సీఎం పినరయి విజయన్ కార్యాలయం, కాంగ్రెస్ నేత ఊమన్ చాందీ తదితరులు తమవంతు సహకారాన్ని అందించారు. విశ్వహిందూ పరిషత్ వారు, ఆమె ప్రయాణానికి అవసరమైన కారును ఏర్పాటు చేశారు. దేవుడి దయవల్ల ఎక్కడా ఎటువంటి అవాంతరమూ లేకుండా తాము జోధ్ పూర్ కు చేరుకున్నామని షీలమ్మా వాసన్ వ్యాఖ్యానించారు.

కాగా, గత ఫిబ్రవరిలోనే అరుణ్ కుమార్ సెలవుపై ఇంటికి వచ్చి, కొన్ని రోజుల అనంతరం తిరిగి డ్యూటీకి వెళ్లాడు. ఆపై రోజుల వ్యవధిలోనే అతను కండరాలకు సంబంధించిన అనారోగ్యం బారిన పడ్డాడన్న సమాచారం వచ్చింది. అతనికి భార్య, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు.


More Telugu News