బార్ పైకప్పులోంచి దూరి.. చిత్తుగా తాగి దొరికిపోయిన రౌడీషీటర్!

  • లాక్ డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలు
  • కర్ణాటకలో రౌడీషీటర్ సాహసం
  • మద్యం మత్తులో బార్లోనే పడిపోయిన వైనం
దేశంలో కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ కొనసాగిస్తుండడంతో మద్యం దుకాణాలు, బార్లు మూతపడ్డాయి. దాంతో మందుబాబుల అవస్థలు అన్నీఇన్నీ కావు. మద్యం కోసం పిచ్చెక్కి మానసిక వైద్యశాలలకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హసన్ పట్టణానికి చెందిన 27 ఏళ్ల రోహిత్ అనే రౌడీ షీటర్ మద్యానికి బానిస. లాక్ డౌన్ కారణంగా మద్యం దొరక్కపోవడంతో అతడి బాధ వర్ణనాతీతం. ఎలాగైనా మద్యం తాగాలని నిశ్చయించుకుని సాహసానికి ఒడిగట్టాడు.

గతంలో తాను రోజూ వెళ్లే బార్ ను లక్ష్యంగా చేసుకున్నాడు. సెక్యూరిటీ కళ్లు గప్పి బార్ పై భాగానికి చేరుకున్నాడు. పైన అతికించిన పెంకులు తొలగించి లోపలికి ప్రవేశించాడు. చాన్నాళ్ల తర్వాత మద్యం కనిపించడంతో మోతాదుకు మించి తాగాడు. దాంతో నిషా తలకెక్కడంతో అక్కడే పడిపోయాడు. ఇక, సెక్యూరిటీ గార్డులు గోడ పక్కనే ఉన్న చెప్పులు చూసి అనుమానం రావడంతో బార్ లోకి వెళ్ల చూడగా, రౌడీషీటర్ రోహిత్ మద్యం మత్తులో నిద్రపోతూ కనిపించాడు. ఆ గార్డులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News