విశాఖలో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ఆసుపత్రి సిబ్బందిపై ఇచ్చిన రివ్యూ ఇదిగో!

  • యూకే నుంచి విశాఖ వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్
  • మార్చి 21న జీహెచ్ సీసీడీలో చేరిక
  • ఏప్రిల్ 8న డిశ్చార్జి
భారత్ లో కరోనా వ్యాపిస్తున్న తొలినాళ్లలో ఎక్కువగా విదేశాల నుంచి వచ్చినవారే బాధితులయ్యారు. యూకే నుంచి విశాఖ వచ్చిన పాతికేళ్ల యువకుడు కూడా కరోనా పాజిటివ్ గా తేలడంతో మార్చి 21న విశాఖ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. పూర్తిగా కోలుకున్న ఆ యువకుడ్ని ఆసుపత్రి వర్గాలు ఏప్రిల్ 8న డిశ్చార్జి చేశాయి. కాగా, ఆ యువకుడు తన క్వారంటైన్ అనుభవాలను, ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్య సిబ్బంది గురించి రివ్యూ ఇచ్చాడు.

"కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత విశాఖ జీహెచ్ సీసీడీలో చికిత్స పొందాను. అక్కడి నాకు చికిత్స అందించిన విధానం అద్భుతం. కరోనా వైరస్ తో పోరాడే క్రమంలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఎల్లవేళలా అండగా నిలిచారు. నిరంతరం స్ఫూర్తి కలిగిస్తూ మనోధైర్యం అందించారు. అంతేకాదు, ఎప్పుడూ ఫీల్డ్ లో ఉండి పనిచేసే ఏఎన్ఎంలు, ఎండీవో, మరికొందరు ఇతర అధికారులు కూడా నా విషయంలో మొదటి నుంచి ఎంతో శ్రద్ధ చూపించేవారు. నా ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. నిజంగా నాకు ఎంతో శ్రద్ధగా చికిత్స అందించడం పట్ల ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ వెల్లడించాడు.


More Telugu News