కాణిపాకం వినాయక స్వామిపై ప్రమాణం చేసి చెబుతాను!: కన్నాకు విజయసాయిరెడ్డి కౌంటర్

  • వారు కూడా ప్రమాణం చేసి నిజాలు చెప్పడానికి సిద్ధమా? 
  • నాపై లేనిపోని ఆరోపణలు చేశారు
  • సుజనా కొన్ని వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేశారు
  • రూ.20 కోట్లకు కన్నా లక్ష్మీ నారాయణ అమ్ముడుపోయారు
తానెన్నడూ అవినీతికి పాల్పడలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'ఏ ఆలయం వద్దయినా భగవంతుడి మీద ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. వారు కూడా ప్రమాణం చేసి నిజాలు చెప్పడానికి సిద్ధమా? ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. నాపై లేనిపోని ఆరోపణలు చేశారు. సుజనా చౌదరి కొన్ని వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేసి, బోగస్‌ కంపెనీలను సృష్టించారు. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న బ్యాంకుల్లో బలహీనంగా ఉన్న బ్యాంకులను విలీనం చేసే పరిస్థితి వచ్చిందంటే సుజనా వంటి వారి వల్లే' అని ఆరోపించారు.

'రూ.20 కోట్లకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అమ్ముడుపోయారన్న ఆరోపణలకు నేను కట్టుబడి ఉన్నాను. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన కొందరు బీజేపీకి నష్టం కలిగిస్తున్నారు. ఆ పార్టీ ఇమేజ్‌ను తగ్గిస్తున్నారు. కన్నా లక్ష్మీ నారాయణ ఎంత అవినీతి పరుడో నాకు తెలుసు. ఆయనను గుండెమీద చేయి వేసుకుని ఒక్క మాట చెప్పమని చెప్పండి' అని అన్నారు.

'బీజేపీ అధిష్ఠానం గత ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీకి ఎన్ని డబ్బులు ఇచ్చింది? దాంట్లో గుంటూరు జిల్లాకు కన్నా ఎంత తీసుకున్నారు? పురందేశ్వరి ఎంత తీసుకున్నారు? ఈ ఖర్చుల వివరాలు కన్నా బీజేపీ అధిష్ఠానానికి ఇచ్చారా? ఎంత దుర్వినియోగం జరిగింది?

'ఈ విషయాలను నేను బయట పెట్టగలను. కానీ, ఇది బీజేపీ అంతర్గత విషయం కాబట్టి నేను బయట పెట్టదలుచుకోలేదు. ఏ విధంగా ఆ నిధులు దుర్వినియోగం చేశాడో నాకు తెలుసు. 20 కోట్ల రూపాయలకు కన్నా అమ్ముడు పోయాడని కూడా నేను నిరూపించగలను' అని విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు.

'ఆ ఫండ్సు ఏమయ్యాయి? బీజేపీ అధిష్ఠానం పంపిన డబ్బుల్లో ఎంత దుర్వినియోగం జరిగిందో నేను చెప్పగలను. ఆయన అంటున్నాడు కదా.. కాణిపాకం వినాయక స్వామి ముందు ప్రమాణం చేయాలని. అంతా నిజమే చెబుతానని నేను దేవుడి ముందు ప్రమాణం చేస్తాను. సాష్టాంగ నమస్కారం చేసి సత్యాలను చెబుతాను' అని ఆవేశంగా అన్నారు. ఈ పని కన్నా లక్ష్మీ నారాయణ కూడా చేయాలని చెప్పారు. అవినీతికి పాల్పడ్డ ఇటువంటి వ్యక్తులు తనను ప్రశ్నిస్తున్నారని, తాను ఒక్క రూపాయి అవినీతికి కూడా పాల్పడలేదని విజయసాయి అన్నారు.


More Telugu News