లాక్‌డౌన్‌లో సారా ఏరులై పారుతోందన్న స్పీకర్‌ వ్యాఖ్యలపై జగన్‌ స్పందించాలి: కళా వెంకట్రావు

  • ఏపీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి రాజీనామా చేయాలి
  • వాలంటీర్ల ద్వారా మద్యాన్ని డోర్‌ డెలివరీ చేస్తున్నారు
  • జగన్ తీరు ఐసోలేషన్‌ వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేలా ఉంది
  • అన్న క్యాంటీన్లు తెరవాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా చేసిన పలు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో నాటు సారా ఏరులై పారుతోందని, ఇంత జరుగుతుంటే రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నిద్రపోతుందా? అంటూ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని కళా వెంకట్రావు ప్రస్తావిస్తూ, ఆయన చేసిన‌ వ్యాఖ్యలపై ప్రజలకు ముఖ్యమంత్రి జగన్‌ సమాధానం చెప్పాలని అన్నారు.

సారా ఏరులై పారుతున్నందుకు ఏపీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలకు అవసరమైన పాలు, నీళ్లు దొరకడం కష్టంగా మారిందని, ఇటువంటి సమయంలో మద్యం మాత్రం వాలంటీర్ల ద్వారా డోర్‌ డెలివరీ చేస్తున్నారని కళా వెంకట్రావు అన్నారు.

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అద్భుతంగా పనిచేస్తున్నారని, ఏపీలో మాత్రం జగన్ తాడేపల్లిలోని తన నివాసానికే పరిమితం కావడం సిగ్గుచేటని విమర్శించారు. ఏపీలో కరోనా సోకిన వారిలో 30 శాతం మంది అధికారులు, వైద్యులతో పాటు అత్యవసర సేవలు అందిస్తున్న వారేనని అన్నారు.

జగన్ తీరు చూస్తుంటే ఐసోలేషన్‌ వార్డులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయించి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు తెరవాలని ఆయన కోరారు. అక్రమాస్తులపై సీబీఐ కోర్టుకు అసత్యాలు చెబుతున్న జగన్..‌ ప్రస్తుతం ఏపీలో కరోనా విషయంపై కూడా తప్పుడు సమాచారం అందిస్తున్నారని ఆయన ఆరోపించారు.


More Telugu News