లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వకపోతే.. ఆ నాలుగు రాష్ట్రాలు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేవు!: స్పష్టం చేసిన సర్వే

  • హిమాచల్‌‌, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, యూపీ పరిస్థితులపై ఆందోళన
  • ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు ఇప్పటికే కేంద్రం చర్యలు
  • వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో డబ్ల్యూఎంఏ లిమిట్ పెంపు
  • అయినప్పటికీ తప్పని ఆర్థిక లోటు
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పడిపోయింది. దీంతో ఉద్యోగుల జీతాల్లో ఇప్పటికే పలు రాష్ట్రాలు కోతలు పెట్టాయి. ఈ పరిస్థితులపై ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అధ్యయనంలో పలు విషయాలు తేలాయి.

ప్రస్తుతం విధించిన లాక్‌డౌన్‌లో ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా మే 3 వరకు ఇలాగే కొనసాగిస్తే దేశంలోని నాలుగు రాష్ట్రాలు తమ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేవని వెల్లడైంది. హిమాచల్‌ ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తలెత్తుతుందని తెలిపింది. దేశంలో అధిక ఆదాయం వచ్చే రాష్ట్రాలు కూడా ఇప్పటికే ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్నాయి.

లాక్‌డౌన్‌తో రాష్ట్రాల్లో ఏర్పడుతున్న ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో దేశంలోని పలు రాష్ట్రాలు రుణాల ద్వారా ఆదాయాన్ని సేకరించుకునేందుకు డబ్ల్యూఎంఏ లిమిట్‌ను ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) 60 వరకు పెంచింది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కారణంగా సొంత ఆదాయ వనరులు స్తంభించిపోనున్నాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అధ్యయనంలో తేలింది. రాష్ట్రాల్లో ఏర్పడుతున్న ఈ పరిస్థితులు తిరిగి చెల్లింపులపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయని చెప్పింది.


More Telugu News