400 గీత కార్మిక కుటుంబాలకు జీవనాధారం లేకుండా చేసే అధికారం ఎవరిచ్చారు?: చంద్రబాబు

  • కాకినాడలో రెండువేల తాటి, ఈత చెట్లను రాత్రికి రాత్రి జేసీబీలతో కూల్చేశారు
  • దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలి
  • ప్రతి గీత కార్మికుడికి న్యాయం జరిగే వరకూ టీడీపీ పోరాడుతుంది
ఇళ్ల స్థలాల పేరు చెప్పి నిన్నటిదాకా దళితుల భూములు లాక్కుని వారికి జీవనాధారం లేకుండా చేశారని, ఇప్పుడు గీత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. కాకినాడ రూరల్, నేమం గ్రామంలో ప్రభుత్వం రాత్రికి రాత్రి రెండు వేల తాటి, ఈత చెట్లను  జేసీబీలతో కూల్చివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో దాదాపు 400 గీత కార్మికుల కుటుంబాలకు జీవనాధారం లేకుండా చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని,  ప్రతి గీత కార్మిక కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు టీడీపీ పోరాడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

‘తన జీవితకాలంలో మూడు తరాల గీతకార్మికులకు జీవనాధారమవుతుంది తాటి చెట్టు. అలాంటిది కాకినాడ రూరల్, నేమం గ్రామంలో రాత్రికి రాత్రి 1500 తాటి చెట్లను, 500 ఈత చెట్లను జేసీబీలతో కూల్చేసింది ప్రభుత్వం. గ్రామంలో దాదాపు 400 గీత కార్మిక కుటుంబాలకు జీవనాధారం లేకుండా చేసే అధికారం ఎవరిచ్చారు?. నిన్నటివరకు ఇళ్ళ స్థలాల పేరుచెప్పి దళితుల భూములు లాక్కుని వారికి జీవనాధారం లేకుండా చేశారు. ఇప్పుడు ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ఏమిటీ అహంకారపూరిత చర్యలు? దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ప్రతి గీత కార్మిక కుటుంబానికీ న్యాయం జరిగేవరకూ తెలుగుదేశం పోరాడుతుంది.’ అని బాబు ట్వీట్ చేశారు.


More Telugu News