ఏడు కొండలవాడా ఎక్కడున్నావయ్యా... దర్శనాలు లేక నేటికి 45 రోజులు!

  • లాక్ డౌన్ ను మరోమారు పొడిగించిన టీటీడీ
  • మే 17 తరువాత పరిమితంగా దర్శనాలు
  • కొత్త దర్శన విధానంపై టీటీడీ కసరత్తు
కోట్లాది మంది కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా ప్రజలు కొలుచుకునే తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనం భక్తులకు దూరమై 45 రోజులు అవుతోంది. తిరుమల చరిత్రలో దేవదేవుడి దర్శనాలు ఇన్ని రోజులు లభించక పోవడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న వేళ, మార్చి నెల మూడో వారం నుంచి దర్శనాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కేంద్రం లాక్ డౌన్ ను పొడిగిస్తూ వస్తుండగా, అందుకు అనుగుణంగా తిరుమలలోనూ లాక్ డౌన్ ను టీటీడీ పొడిగిస్తూ వచ్చింది.

ప్రస్తుతం ఈ నెల 17 వరకూ లాక్ డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో అంతవరకూ తిరుమలలో భక్తులను దర్శనాలకు అనుమతించే పరిస్థితి లేదు. తిరుమలతో పాటు టీటీడీ నిర్వహణలో ఉన్న అనుబంధ దేవాలయాల్లోనూ ఇదే నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. ఇక ఆ తరువాత లాక్ డౌన్ ను ఎత్తివేస్తే, పరిమిత సంఖ్యలో అయినా భక్తులకు దర్శనాలను కల్పించాలని భావిస్తున్న టీటీడీ, అందుకు అవలంభించాల్సిన విధి విధానాలపై కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 10వ తేదీ తరువాత సమావేశం కానున్న టీటీడీ పాలక మండలి బోర్డు, దర్శనాల విషయంలో భారీ మార్పులను ప్రకటిస్తుందని సమాచారం. 


More Telugu News