కొడుకును విడిచిపెట్టమంటూ.. పోలీసుల కాళ్లపై పడి ప్రాణాలు విడిచిన తల్లి.. మానవ హక్కుల సంఘం సీరియస్!

  • తమిళనాడులోని సేలంలో ఘటన
  • లాక్‌డౌన్‌లో నిమ్మకాయలు అమ్మాడంటూ యువకుడి అరెస్ట్
  • పోలీసు కమిషనర్‌కు నోటీసు జారీ చేసిన మానవ హక్కుల సంఘం
పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందిన ఘటనపై మానవ హక్కుల సంఘం సీరియస్ అయింది. ఈ ఘటనపై విచారణ జరిపించి రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగిందీ ఘటన. లాక్‌డౌన్ అమల్లో ఉండగా సేలం అమ్మాన్‌పేటలో నిమ్మకాయలు విక్రయించాడనే కారణంతో వేలుమణి అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలిసిన ఆమె తల్లి బాలమణి (70) పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.

తన కొడుకును విడిచిపెట్టాలంటూ పోలీసుల కాళ్లపై పడి క్షమాపణలు కోరింది. విధుల్లో ఉన్న ఎస్సై సహా పోలీసులందరి కాళ్లు మొక్కింది. తన కొడుకును విడిచిపెట్టమని ప్రాధేయపడింది. అయినప్పటికీ పోలీసులు విడిచిపెట్టకపోవడంతో అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలంటూ సేలం మహానగర పోలీసు కమిషనర్‌కు నోటీసు జారీ చేసింది.


More Telugu News