ఏపీ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యల పోస్ట్.. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై వేటు!

  • ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ గా పనిచేస్తున్న విద్యాసాగర్
  • ప్రభుత్వ నియమావళికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు
  • సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సీఐడీ చీఫ్ సునీల్ కుమార్
ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్టును షేర్ చేసిన ఉద్యోగిపై ప్రభుత్వం వేటేసింది. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఎంవీ విద్యాసాగర్ సోషల్ మీడియాలో తనకు వచ్చిన పోస్టును మరొకరికి షేర్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పెట్టిన ఈ పోస్టుపై స్పందించిన ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్.. విద్యాసాగర్‌ను విధులు నుంచి తప్పిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.  దుష్ప్రవర్తన, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గాను సస్పెండ్‌ చేసినట్లు అందులో పేర్కొన్నారు. మరోవైపు, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అందిన ఫిర్యాదు మేరకు విద్యాసాగర్‌ ఫోన్‌ను సైబర్ క్రైం అధికారులు ఆయన స్వాధీనం చేసుకున్నారు.  

విద్యాసాగర్ సస్పెన్షన్ విషయమై సునీల్ కుమార్ మాట్లాడుతూ.. వాట్సాప్ గ్రూపుల్లో విద్యాసాగర్ ప్రభుత్వ వ్యతిరేక విషయాలను పోస్టు చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ వాట్సాప్‌ గ్రూప్‌ల్లో విమర్శలు చేశారని అన్నారు. దీనిపై తమకు ఫిర్యాదులు అందాయని, విచారించగా నిజమేనని తేలిందని అన్నారు.  ప్రభుత్వ ఉద్యోగులు సర్కారు విధానాలకు వ్యతిరేకంగా బహిరంగంగా కానీ, సోషల్ మీడియాలో కానీ ఎటువంటి పోస్టులు చేయకూడదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రవర్తనా నియమావళి ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని సునీల్ కుమార్ హెచ్చరించారు.


More Telugu News