నేడు పోతిరెడ్డిపాడుపై కోతిసర్కస్ లు చేస్తున్న కాంగ్రెస్ నేతలు నాడు వైఎస్ సర్కారులో పాత్రధారులు: కర్నె ప్రభాకర్

  • తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రాజేసిన పోతిరెడ్డిపాడు
  • పార్టీల మధ్య కూడా విమర్శల దాడి
  • తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టారంటూ కాంగ్రెస్ పై కర్నె విమర్శలు
ఏపీలోని పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్యే కాదు, పార్టీల మధ్య కూడా వైషమ్యాలు రాజేస్తోంది. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఘాటుగా స్పందిస్తూ కాంగ్రెస్ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. నేడు పోతిరెడ్డిపాడు అంశంలో కోతిసర్కస్ లు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు 2005లో నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో పాత్రధారులు అని ఆరోపించారు. న్యాయంగా రావాల్సిన 11,500 క్యూసెక్కుల వాటాను కాదని 44,000 క్యూసెక్కులను రాయలసీమకు అప్పనంగా తీసుకుపోతుంటే కిమ్మనకుండా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రుల వద్ద తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టినవారు ఇవాళ పోతిరెడ్డిపాడుపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మాట్లాడుతున్నారని ఆయన నిప్పులు చెరిగారు. 2006లో పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తుంటే అలయెన్స్ లో భాగంగా ఉన్న ఆరుగురు టీఆర్ఎస్ మంత్రులు క్యాబినెట్ భేటీల్లో అసంతృప్తిని తెలియజేయడమే కాకుండా మంత్రిమండలి నుంచి బయటికి వచ్చేశారని వివరించారు.

కృష్ణా నదీ జలాల వాటా విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉందని, 2019లో ఏపీ క్యాబినెట్ లో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు ప్రతిపాదన అంటూ మీడియాలో వచ్చిన కథనాలతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఇప్పుడు జీవో 203 వచ్చిన వెంటనే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, ఈ వ్యవహారంలో ఎలా ముందుకు పోవాలన్నదానిపై సీఎం కేసీఆర్ చర్చించారని, అంతటి అపర భగీరథుడ్ని పట్టుకుని పోతిరెడ్డిపాడుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ సర్కారుకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, వాటికి భంగం కలగనంతవరకే కేంద్రంతోనైనా, పక్క రాష్ట్రాలతోనైనా స్నేహ సంబంధాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఒకవేళ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే అది కేంద్రమైనా, పక్క రాష్ట్రమైనా రాజీపడే ప్రసక్తే ఉండదని కర్నె ప్రభాకర్ తేల్చి చెప్పారు.


More Telugu News