నిమ్మగడ్డ రమేశ్‌ వ్యవహారం.. ఏ రోజు ఏం జరిగింది?

  • 2016 జ‌న‌వ‌రి 30న.. ఎస్‌ఈసీగా నియామకం
  • 2020, మార్చిలో స్థానిక సంస్థల నోటిఫికేషన్
  • 2020, ఏప్రిల్ 10న నిమ్మగడ్డను తొలగిస్తూ ఆర్డినెన్స్
  • ఏప్రిల్ 12న హైకోర్టుకు నిమ్మగడ్డ
  • 2020 ఏప్రిల్ 18న ఏపీ సర్కారు కౌంటర్‌ పిటిషన్.. నేడు తీర్పు
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి నియమించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కేసులోని పూర్వాపరాలను పరిశీలిద్దాం.

2016 జ‌న‌వ‌రి 30న.. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను అప్పటి ప్రభుత్వం నియమించింది. అన్ని ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు.

2020, మార్చి... ఏపీలో హైకోర్టు ఆదేశాల ప్రకారం రిజ‌ర్వేష‌న్ల అంశంలో మార్పుల‌తో స్థానిక ఎన్నిక‌ల ప్ర‌క్రియను నిమ్మగడ్డ చేప‌ట్టారు. సమర్థవంతంగా శర వేగంగా ఆ ప్రక్రియ పూర్తి చేసి మార్చి‌లో జిల్లా, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌లు సహా మునిసిప‌ల్, పంచాయితీ ఎన్నిక‌ల‌కు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు.

స్థానిక ఎన్నికల షెడ్యూలు కూడా విడుదల చేసి నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. అనంతరం కరోనా విజృంభించడం ప్రారంభమైంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణను వాయిదా వేస్తూ సొంతంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయనపై వైసీపీ నేతల విమర్శలు ప్రారంభమయ్యాయి. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ కులాన్ని కూడా ప్ర‌స్తావించడం గమనార్హం.  

2020, ఏప్రిల్ 10.. ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డను తొలగిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. జీఓ 618ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆయన స్థానంలో కనగరాజును ఎస్ఈసీగా నియమించారు.   

2020, ఏప్రిల్ 12... తనను తొలగిస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మొదట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ఆ తర్వాత నేరుగా విచారణ కొనసాగింది.

2020 ఏప్రిల్ 18..  వైద్య ఆరోగ్య శాఖ‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని సంప్ర‌దించ‌కుండా నిమ్మగడ్డ నిర్ణ‌యం తీసుకోవ‌డాన్ని సవాలు చేస్తూ ప్ర‌భుత్వం కౌంటర్ పిటిషన్‌ దాఖలు చేసింది.  
 
2020 మే 29.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలన్నింటినీ హైకోర్టు కొట్టేస్తూ తీర్పునిచ్చింది. తిరిగి ఎస్ఈసీగా నిమ్మగడ్డ కొనసాగాలని ఆదేశించింది. జీఓ 618ను కొట్టేసింది.


More Telugu News