నన్ను హత్య చేసి ఉంటే.. అఖిలప్రియపై కనీసం అనుమానం కూడా వచ్చేది కాదు: ఏవీ సుబ్బారెడ్డి

  • అఖిలప్రియను సొంత కూతురులా పెంచాను
  • 30 ఏళ్లుగా భూమా కుటుంబానికి అండగా ఉన్నా
  • కార్యకర్తలను ఎలా కాపాడుకుంటానో.. ఎవరిని అడిగినా చెపుతారు
ఆళ్లగడ్డ రాజకీయం ఆరోపణలు, ప్రత్యారోపణలతో రోజురోజుకూ వేడెక్కుతోంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు, భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డికి మధ్య తలెత్తిన విభేదాలు తార స్థాయికి చేరాయి.

 ఏవీ సుబ్బారెడ్డిని చంపాల్సిన అవసరం తనకు లేదని.. ఆయన ఆరోపణల వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని నిన్న అఖిలప్రియ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆళ్లగడ్డలో సుబ్బారెడ్డి రాజకీయాలు చేయాలనుకుంటే తాను కూడా స్వాగతిస్తానని... అయితే గంగుల కుటుంబాన్ని ఎదుర్కొని పార్టీ కార్యకర్తలకు ఆయన పనులు ఎలా చేయిస్తారో చూడాలనే కోరిక తనకు కూడా ఉందని ఎద్దేవా చేశారు.

ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి ఏవీ సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించి అరెస్ట్ అయిన వారికి, భూమా అఖిలప్రియకు సంబంధం ఉందో? లేదో? చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్నప్పటి నుంచి సొంత కూతురు మాదిరి అఖిలప్రియను పెంచానని ... తనను హత్య చేసినా ఆమెపై ఎవరికీ అనుమానం వచ్చి ఉండేది కాదని అన్నారు. తన సొంత కుమార్తెలు కూడా అఖిలప్రియపై అనుమానం వ్యక్తం చేసేవారు కాదని చెప్పారు.

తన హత్యకు కుట్ర జరిగిందనే విషయాన్ని పోలీసులు చెప్పడంతో తాను షాక్ కు గురయ్యానని సుబ్బారెడ్డి అన్నారు. 30 ఏళ్లుగా భూమా కుటుంబానికి అండగా ఉన్నానని... బాంబు దాడులు జరుగుతున్న సమయంలో భూమా నాగిరెడ్డిని భుజాలపై ఎత్తుకెళ్లి నామినేషన్ వేయించానని చెప్పారు. కార్యకర్తలను తాను ఎలా కాపాడుకుంటానో... ఆళ్లగడ్డలో ఏ ఒక్క స్థానిక నేతను అడిగినా చెపుతారని అన్నారు. అఖిలప్రియ వంటి నేతలు ఉంటే... మరెందరు చచ్చిపోతారో అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.


More Telugu News