తూర్పు గోదావరి జిల్లా వ్యక్తికి కరోనా.. అంత్యక్రియల్లో పాల్గొన్న 30 మందిలో భయం!

  • మృతి చెందిన వ్యక్తి నుంచి నమూనాల సేకరణ
  • ఫలితం రాకముందే అంత్యక్రియలు
  • విషయం తెలిసి రంగంలోకి దిగిన వైద్యాధికారులు, పోలీసులు
కరోనాతో మరణించాడని తెలియక 40 ఏళ్ల వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న 30 మంది ఇప్పుడు భయంతో వణుకుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలోని పీఈ చిన్నాయిపాలెంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల అస్వస్థతతో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఈ నెల 5న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ తర్వాతి రోజు ప్రాణాలు కోల్పోయాడు.

మృతదేహం నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు వాటిని కోవిడ్ పరీక్షలకు పంపారు. మరోవైపు, ఫలితం రాకుండానే ఈ నెల 7న మృతదేహాన్ని గ్రామానికి తరలించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, మృతుడికి కరోనా సోకినట్టు సోమవారం వైద్యులకు నివేదిక అందింది. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి బాధిత కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. అంత్యక్రియల్లో 30 మంది వరకు పాల్గొన్నట్టు అధికారులు గుర్తించారు. వారికి పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వారంతా ఇప్పుడు కరోనా భయంతో వణుకుతున్నారు.


More Telugu News