కరోనా నేపథ్యంలో ఐసీసీ కొత్త నిబంధనలు

  • అన్ని వ్యవస్థలతో పాటు క్రికెట్ నూ మార్చేసిన కరోనా
  • బంతి ఉమ్మి రుద్దడాన్ని నిషేధించిన ఐసీసీ
  • ఎక్కడ మ్యాచ్ జరిగితే అక్కడి అంపైర్లతో విధులు
కరోనా వైరస్ ప్రభావంతో యావత్ ప్రపంచం కొత్త రూపు సంతరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం తదితర అంశాలు సాధారణ జనజీవనంలో భాగం అయ్యాయి. ఇక క్రికెట్ విషయానికొస్తే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పలు మధ్యంతర మార్పులు అమలు చేయాలని నిర్ణయించింది. ఆటగాళ్లను కరోనా బారి నుంచి రక్షించడానికి అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ తగిన విధంగా కొత్త నిబంధనలు రూపొందించింది.

ఐసీసీ కొత్త మార్పులు

  • ఓ టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎవరైనా ఆటగాడు కరోనా లక్షణాలతో బాధపడుతుంటే అతడి స్థానాన్ని రిజర్వ్ బెంచ్ లో ఉన్న ఆటగాడితో భర్తీ చేయొచ్చు. ఈ వెసులుబాటు కేవలం టెస్టులకే పరిమితం.
  • బంతిపై ఉమ్మి రుద్దడం నిషేధం. ఒకవేళ బౌలర్ బంతిపై ఉమ్మిని రుద్దినట్టయితే అంపైర్లు రెండు సార్లు వార్నింగ్ ఇస్తారు. మూడో పర్యాయం కూడా అదే తప్పు చేస్తే ఫీల్డింగ్ జట్టుకు 5 పరుగుల జరిమానా పడుతుంది.
  • ఏ సిరీస్ లోనూ తటస్థ అంపైర్లు ఉండరు. ఎక్కడ మ్యాచ్ జరిగితే అక్కడి స్థానిక అంపైర్లనే మ్యాచ్ లో వినియోగిస్తారు.
  • ఓ మ్యాచ్ లో ప్రతి ఇన్నింగ్స్ లో ఇరు జట్లకు అదనంగా మరో డీఆర్ఎస్ చాన్స్.
  • టెస్టు మ్యాచ్ లో ధరించే షర్టుపైనా, స్వెటర్ పైనా అదనపు లోగోకు అనుమతి. అయితే ఆ లోగో 32 చదరపు అంగుళాల సైజు మించకూడదు.


More Telugu News