ప్రియుడిని ఏటీఎంకు పంపి.. మహిళను లైంగికంగా వేధించిన అమరావతి ఎస్సై!

  • లాడ్జీలో దిగిన పెదకూరపాడు మండలానికి చెందిన జంట
  • వ్యభిచారం కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 10 వేలు డిమాండ్
  • విచారణకు ఆదేశించిన ఎస్పీ
ఓ లాడ్జీలో దిగిన జంటను బెదిరించి వారి నుంచి డబ్బులు గుంజడంతోపాటు మహిళపై లైంగిక వేధింపులకు దిగిన అమరావతి ఎస్సై రామాంజనేయులుపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. పోలీసుల కథనం ప్రకారం.. పెదకూరపాడు మండలానికి చెందిన ఓ జంట సోమవారం అమరావతిలోని ఓ లాడ్జిలో దిగింది.

సమాచారం అందుకున్న అమరావతి ఎస్సై రామాంజనేయులు వ్యక్తిగత వాహనంలో డ్రైవర్ సాయికృష్ణతో కలిసి లాడ్జికి చేరుకుని వారిని పట్టుకున్నాడు. వ్యభిచారం కేసు నమోదు చేస్తానని వారిని బెదిరించాడు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాము అంత ఇచ్చుకోలేమని, రూ. 5 వేలు ఇవ్వగలమని చెప్పి తమ వద్ద ఉన్న మూడువేల రూపాయలను ఎస్సైకి ఇచ్చారు.

మిగతా రెండువేల రూపాయల కోసం యువకుడిని ఎస్సై ఏటీఎంకు పంపాడు. అతడికి తోడుగా తన డ్రైవర్‌ను కూడా పంపిన ఎస్సై.. వారు వెళ్లగానే ఒంటరిగా ఉన్న మహిళను లైంగికంగా వేధించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను హెచ్చరించాడు. ఏటీఎం నుంచి యువకుడు వచ్చిన తర్వాత వారి నుంచి వివరాలు తీసుకుని వదిలిపెట్టాడు.

ఎస్సై తీరుపై బాధితులు మంగళవారం డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన ఈ విషయాన్ని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావుకు చేరవేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు. నివేదిక వచ్చిన వెంటనే ఎస్సై, అతడి డ్రైవర్‌పై చర్యలు తీసుకోనున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.


More Telugu News