12 ఏళ్ల వయసులోనే అప్పుల వసూలు కోసం ఊళ్లో తిరిగిన అనుభవం... ఎస్బీఐ ఎండీ చల్లా శ్రీనివాసులు రియల్ స్టోరీ!

  • ప్రస్తుతం ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసులు శెట్టి
  • రుణాల వసూలు విషయంలో ముందుండే ఎండీ
  • మారటోరియంతో బ్యాంకులకు ఇబ్బందులు
  • ఆగస్టు తరువాత ఎదురుకానున్న సవాళ్లు
  • వాటిని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక
  • వెల్లడించిన చల్లా శ్రీనివాసులు శెట్టి
చల్లా శ్రీనివాసులు శెట్టి... తన 12 సంవత్సరాల వయసులోనే తండ్రి నడుపుతున్న నిత్యావసరాల దుకాణాల్లో అప్పు పెట్టిన వారి ఇళ్లకు వెళ్లి వాటిని వసూలు చేసే పనిలో తిరిగేవాడు. ఏపీలోని పొట్లపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, వ్యవసాయ ఉత్పత్తులు చేతికి వచ్చే సమయం రాగానే, గ్రామంలోని దాదాపు 150 ఇళ్లకు వెళ్లి, తన తండ్రికి రావాల్సిన బకాయిలను వసూలు చేసేవాడు. చేతిలో అప్పుల జాబితాను పట్టుకుని, తన అన్నతో కలిసి గ్రామమంతా తిరుగుతూ, అప్పులు వసూలు చేసేవాడు.

42 సంవత్సరాల తరువాత, ఇప్పుడు కూడా శ్రీనివాసులు రుణాల వసూలు పనులపైనే తిరుగుతున్నారు. అయితే, ఆ రుణాల మొత్తమే చాలా ఎక్కువ. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని ముగ్గురు మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న శ్రీనివాసులు శెట్టి, దాదాపు రూ. 1.5 లక్షల కోట్లను రుణగ్రహీతల నుంచి వసూలు చేయడానికి శ్రమిస్తున్నారు.

"నా సోదరుడు చాలా సున్నితమైన వ్యక్తి. గ్రామస్థులతో మెత్తగా మాట్లాడేవాడు. అందుకే నేను చేసే వసూళ్లతో పోలిస్తే, అతని కలెక్షన్లు తక్కువగా ఉంటుండేవి" అని శ్రీనివాసులు సోదరుడు తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా ఉన్న ఎస్బీఐలో టాప్ పోస్ట్ జాబ్ కు ఒక్క మెట్టు కింద పనిచేస్తున్న ఆయన, గతంలో బ్యాంకు ఇచ్చిన 19.6 బిలియన్ డాలర్ల రుణాలను వసూలు చేసే విధుల్లో ఉన్నారు.

ప్రపంచంలోని అతిపెద్ద ఎకానమీల్లో ఒకటిగా ఉన్న భారత్ లో మొండి బకాయిల మొత్తం ఇప్పటికే గరిష్ఠానికి పెరిగిపోయిన నేపథ్యంలో, కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా రుణాల వసూలు మరింతగా తగ్గిపోయింది. ఈ సమయంలో ఎస్బీఐకి శ్రీనివాసులు సేవలు చాలా కీలకమయ్యాయి. "రుణాల వసూలులో నా తండ్రి నుంచి నేను రెండు విషయాలను నేర్చుకున్నాను. ఎంత వేగంగా డబ్బును రికవరీ చేస్తామన్నది ఇక్కడ చాలా ప్రధానమైన అంశం. రికవరీలను పూర్తి చేయడంలో ఏ మాత్రం ఒత్తిడికి గురి కాకుండా, రుణ గ్రహీతల వెంట తిరుగుతూ ఉండాల్సిందే" అని గత జనవరిలో బ్యాంకు ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, తానిచ్చిన తొలి ఇంటర్వూలో శ్రీనివాసులు వ్యాఖ్యానించారు.

బ్యాంకులో వివిధ పొజిషన్లలో 32 సంవత్సరాల పాటు పని చేసిన ఆయన, రుణాల రికవరీల్లో ముందు నిలిచి, బ్యాంకు రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ విభాగాలనూ పర్యవేక్షిస్తున్నారు. ఇండియాలోని బ్యాంకులకు రావాల్సిన మొత్తం బకాయిల్లో దాదాపు 20 శాతం ఎస్బీఐకే రావాల్సి వున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రుణాల విషయంలో తాము వన్ టైమ్ సెటిల్ మెంట్ కు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇదే తొలి సూత్రంగా అడుగులు వేస్తున్నామని, ఈ విధానం సత్ఫలితాలను ఇస్తోందని శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ఇక డిఫాల్టర్లు ఎక్కడున్నారో పట్టుకుని, వారి వెంట పడటం రెండో ప్రధానమైన అంశమని, ఈ విషయంలో చిన్న, మధ్య తరహా కంపెనీలకు చెందిన ఖాతాలే కీలకమని అభిప్రాయపడ్డారు.

వైరస్ మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ 40 సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయిన వేళ, బ్యాంకులకు రావాల్సిన రుణాల వసూలు సైతం కష్టసాధ్యమైందని, ఆరు నెలల మారటోరియం బ్యాంకులకు కష్టకాలాన్ని తెచ్చి పెట్టిందని అభిప్రాయపడ్డ ఆయన, ఎస్బీఐ రిటైల్ కస్టమర్లలో 21 శాతం, కార్పొరేట్ రుణ గ్రహీతల్లో 10 శాతం మారటోరియం సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతానికి వీరిపై ఎటువంటి చర్యలూ తీసుకునే వీల్లేదని, ఆగస్టు తరువాత వీరి నుంచి భారీ ఎత్తున బకాయిలు వసూలు చేయాల్సి రావచ్చని తెలిపారు.

రికవరీ సవాళ్లను అధిగమించేందుకు తమదైన ప్రణాళికలను రూపొందిస్తున్నామని వెల్లడించిన ఆయన, రుణ గ్రహీతలకున్న సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడం ద్వారా, బ్యాంకుకు రావాల్సిన బకాయిలను వసూలు చేసుకునే ఆలోచనలో ఉన్నామని అన్నారు. తన చిన్న వయసులో రైతులకు డబ్బులు వచ్చే సమయంలో వారింటి మందుకు వెళ్లి నిలబడేవాళ్లమని, ఇప్పుడూ అదే సూత్రం పని చేస్తోందని తెలిపారు.


More Telugu News