వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల చరిత్రలు ఇవే.. అదొక బిస్కెట్ పార్టీ: వర్ల రామయ్య

  • మోపిదేవి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తారు
  • అయోధ్య రామిరెడ్డిపై 10 కేసులు ఉన్నాయి
  • పరిమళ్ నత్వానీ అంబానీకి చెందిన వ్యక్తి
ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాల కోసం ఈరోజు పోలింగ్ జరుగుతోంది. వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ బరిలో ఉన్నారు. టీడీపీ తరపును వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యులపై వర్ల తీవ్ర విమర్శలు గుప్పించారు. మోపిదేవికి నేర చరిత్ర ఉందని... ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తిని జగన్ ఎంపిక చేశారని విమర్శించారు. అయోధ్య రామిరెడ్డిపై దేశ వ్యాప్తంగా 10 కేసులు ఉన్నాయని అన్నారు. మూడో వ్యక్తి పరిమళ్ నత్వానీ మన రాష్ట్రానికి చెందిన వ్యక్తే కాదని, అంబానీకి చెందిన ఈయనను జగన్ ఎందుకు ఎంపిక చేశారో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు.

పెద్దల సభకు ఇలాంటి వ్యక్తులను కాకుండా మంచివాళ్లను పంపించాలని వైసీపీ ఎమ్మెల్యేలను కోరుతున్నానని వర్ల చెప్పారు. రాజ్యసభ పోటీలో తాను కూడా ఉన్నానని... తనకు ఎలాంటి క్రిమినల్ చరిత్ర లేదని... పేద, బడుగు, బలహీనవర్గాల వాణిని రాజ్యసభలో బలంగా వినిపిస్తానని అన్నారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయం మేరకు కాకుండా, ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నానని చెప్పారు. ఇదే సమయంలో జగన్ పై విమర్శలు గుప్పించారు. రెండు సీట్లను బీసీలకు ఇచ్చేబదులు...  ఒక సీటును ఎస్సీకి ఇవ్వచ్చుకదా అని అన్నారు. ఈ విషయాన్ని ఎస్సీ ఎమ్మెల్యేలు జగన్ ను ఎందుకు అడగలేకపోయారని ప్రశ్నించారు. వైసీపీ ఒక బిస్కెట్ పార్టీ అని ఎద్దేవా చేశారు.


More Telugu News