ఉద్రిక్తతల నడుమ లడఖ్ పర్యటనకు వెళుతున్న భారత ఆర్మీ చీఫ్

  • నిన్న 11 గంటల పాటు చర్చించిన భారత్‌-చైనా 
  • చర్చల ఫలితాలపై రాని స్పష్టత
  • రెండు రోజులు లడఖ్‌లో పర్యటించనున్న నరవాణె
తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద చైనా-భారత్ సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణ కలకలం రేపిన నేపథ్యంలో ఇరు దేశాల సైన్యాధికారులు చర్చలు కొనసాగిస్తున్నారు. సమస్య పరిష్కారానికి నిన్న  ఉన్నత స్థాయి ఆర్మీ అధికారులు ఏకంగా 11 గంటల పాటు చర్చించారు. భారత్‌ నుంచి కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. నిన్న భేటీ అసంపూర్తిగానే ముగిసినట్లు తెలిసింది. గాల్వన్‌ లోయ వద్ద ఇరు దేశాల మేజర్‌ జనరల్‌ స్థాయి సైనికాధికారులు చర్చలు జరపడం ఇది రెండో సారి. చర్చల ఫలితాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.

కాగా, ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ రోజు భారత ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణె లడఖ్‌లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుందని అధికారులు తెలిపారు. భద్రతతో పాటు అక్కడి పరిస్థితులను నరవాణె సమీక్షించనున్నారు. కాగా, గాల్వన్ లోయ నుంచి తిరిగి వెళ్లేందుకు చైనా అంగీకరించట్లేదని సమాచారం. గాల్వన్‌లోయ మొత్తం తమదేనని చైనా వాదిస్తున్నట్లు తెలిసింది.



More Telugu News