కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. నగ్నంగా వీడియోలు తీసి బీటెక్ విద్యార్థినికి వేధింపులు

  • మూడేళ్లుగా వేధిస్తున్న ఇద్దరు యువకులు
  • నగ్న వీడియోలను ఇంటర్నెట్‌లో పెట్టి వేధింపులు
  • ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు
బీటెక్ విద్యార్థినిపై మూడేళ్లుగా జరుగుతున్న దారుణ ఘటనకు సంబంధించిన కేసులో గుంటూరు పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన విద్యార్థినికి (20) మూడేళ్ల క్రితం వరుణ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. చనువు పెరిగిన తర్వాత చదువుకుందాం రమ్మని తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆపై ఆమెను నగ్నంగా మార్చి వీడియోలు, ఫొటోలు తీశాడు. ఆపై వాటిని అడ్డం పెట్టుకుని బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె అతడిని దూరం పెట్టింది.

అనంతరం ఆమె ఇంజినీరింగ్‌లో చేరగా అక్కడామెకు కౌశిక్ అనే యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానన్నాడు. దీంతో కౌశిక్ కుటుంబ సభ్యులు కాలేజీకి వెళ్లి యువతి గురించి వివరాలు సేకరించగా వరుణ్ విషయం బయటకు వచ్చింది. వరుణ్ తీసిన వీడియోలను సేకరించి కౌశిక్‌కు చూపించారు. దీంతో అతడు ఆమెకు దూరంగా జరిగాడు. అయితే, యువతి మరొకరితో సన్నిహితంగా ఉంటోందని అనుమానించిన కౌశిక్ తన వద్ద ఉన్న నగ్నవీడియోలను ఇంటర్నెట్‌లో పెట్టడంతోపాటు డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు.

విషయం తెలిసిన యువతి బంధువులు వరుణ్, కౌశిక్ కుటుంబ సభ్యులను కలిసి ఆ వీడియోలను ఇంటర్నెట్ నుంచి తొలగించేలా చేశారు. అయితే, ఇటీవల మళ్లీ ఆ వీడియోలు సోషల్ మీడియాలో మళ్లీ కనిపించడంతో విస్తుపోయిన యువతి తాజాగా పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుణ్, కౌశిక్‌లను అరెస్ట్ చేశారు.


More Telugu News