ఈసారి సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణాస్త్రాలు సంధించిన పట్టాభిరామ్

  • సరస్వతి ఇండస్ట్రీస్ నేపథ్యంలో పట్టాభి మీడియా సమావేశం
  • అక్రమ జీవో జారీ చేశారని వెల్లడి
  • జీవో కొట్టివేయాలంటూ చేయాలంటూ డిమాండ్
ఇటీవల తమ పార్టీ నాయకులపై అధికార పక్షం కేసులు పెడుతున్న నేపథ్యంలో టీడీపీ తన ఆరోపణల్లో పదును పెంచింది. ఈసారి సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుంది. సరస్వతి ఇండస్ట్రీస్ కోసం సీఎం జగన్ అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పట్టాభి మాట్లాడుతూ, సొంత పరిశ్రమ కోసం సీఎం జగన్ జల చౌర్యానికి పాల్పడ్డారని వెల్లడించారు.

వాస్తవానికి సరస్వతి ఇండస్ట్రీస్ కు ఏడాదికి 0.036 శాతం టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించే అవకాశం ఉందని పర్యావరణ శాఖ స్పష్టం చేసిందని, అయితే, అందుకు రెండింతలు నీటిని కేటాయిస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిందని వివరించారు. నీటిని సరస్వతి ఇండస్ట్రీస్ కు మళ్లిస్తూ జారీ చేసిన ఈ జీవో అక్రమం అని అన్నారు. ఈ జీవోను తక్షణమే కొట్టివేయాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, గతంలో సరస్వతి ఇండస్ట్రీస్ కు 613 హెక్టార్ల భూములు కేటాయించారని, కానీ నిబంధనల ప్రకారం రెండేళ్లయినా పనులు ప్రారంభం కాకపోవడంతో అప్పటి కిరణ్ కుమార్ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీచేసిందని పట్టాభి వెల్లడించారు. ఆ నోటీసులకు సరస్వతి సంస్థ నుంచి వచ్చిన జవాబు సంతృప్తికరంగా లేకపోవడంతో మైనింగ్ లీజు రద్దు చేస్తూ జీవో విడుదల చేశారని తెలిపారు.

దాంతో సరస్వతి సంస్థ ఆ జీవోను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లడమే కాకుండా, తన పిటిషన్ పెండింగ్ లో ఉండగానే, పర్యావరణ అనుమతుల పొడిగింపునకు దరఖాస్తు చేసుకుందని తెలిపారు. ఆ దరఖాస్తులో  మైనింగ్ లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన  జీవో 98,   దానికి సంబంధించిన  లిటిగేషన్ కోర్టులో  ఉన్న విషయం దాచిపెట్టి..    మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో అనుకున్న సమయానికి పనులు ప్రారంభించలేకపోయామని ఆ దరఖాస్తులో తెలిపారని పట్టాభి వివరించారు. అంతేకాకుండా తమకు కేటాయించిన భూమిలో ప్రభుత్వ భూమి కూడా  ఉన్న విషయం కోర్టు దృష్టికి వెళ్లనీయకుండా చేసి  తమకు అనుకూలంగా తీర్పు వచ్చేట్లు చేసుకున్నారని.. అందుకు అడ్వకేట్ జనరల్ సహకరించారని ఆరోపించారు.

కానీ, ఏపీ సర్కారు కొత్త రాజధాని కడుతోందన్న నేపథ్యంలో అక్కడి భవన నిర్మాణాలకు సిమెంట్ అవసరమవుతుందన్న భావనతో తమకు కంపెనీకి అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో గుర్తుకురాని అమరావతి, సొంత కంపెనీ ప్రయోజనాల కోసం గుర్తుకు వచ్చిందని సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.


More Telugu News