విశాఖ వరుస ఘటనల వెనుక కుట్రలున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి: వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్

  • విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నట్టున్నాయ్
  • విచారణ జరిపించాలని సీఎంను కోరుతున్నా
  • చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారు
కెమికల్ ఫ్యాక్టరీలలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో విశాఖ నగరం వణుకుతోంది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం తర్వాత మరో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా సాల్వెంట్ కంపెనీలో ట్యాంకు పేలడంతో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో విశాఖ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, జరుగుతున్న ఘటనలపై అనుమానాలను వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాల వెనుక కుట్రలున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని... వీటిపై లోతైన విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరుతున్నానని చెప్పారు.

విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసి, రాజధాని రాకుండా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయనే భయం కలుగుతోందని అమర్నాథ్ అన్నారు. 2014లో అమరావతి కోసం భూములు ఇవ్వని రైతుల అరటి తోటలను తగలబెట్టి, వైసీపీ మీద ముద్ర వేశారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏ ప్రమాదం జరిగినా శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రమాదాలపై సీఎం జగన్ మాట్లాడటం లేదని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అమర్నాథ్ చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ కేసులో విచారణ జరిపించి, దోషులను జైలుకు పంపించారని చెప్పారు. టీడీపీ హయాంలో జరిగిన ప్రమాదాల్లో ఒక్కరినైనా చంద్రబాబు జైలుకు పంపించారా? అని ప్రశ్నించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయాలనుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.


More Telugu News