భారత్ లో క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధమైన ఆక్స్ ఫర్డ్

  • కొవిషీల్డ్ పేరిట వ్యాక్సిన్ రూపొందించిన ఆక్స్ ఫర్డ్
  • భారత్ లోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం
  • కేంద్రానికి దరఖాస్తు చేసుకున్న సీరమ్ ఇన్ స్టిట్యూట్
  • రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ కోసం దరఖాస్తు
కరోనా మహమ్మారిని సమర్థవంతంగా అడ్డుకునే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో పరిశోధనలు జరుగుతుండగా, అన్నింటిలోకి విజయవంతమైన వ్యాక్సిన్ గా గుర్తింపు దక్కించుకున్న కొవిషీల్డ్ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ లోనూ దూసుకుపోతోంది. ఈ వ్యాక్సిన్ ను బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ప్రముఖ బయో ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించాయి.

అయితే, క్లినికల్ ట్రయల్స్ లో మానవులపై ప్రయోగించే క్రమంలో రెండు, మూడు దశలు ఎంతో కీలకమైనవి. ఇప్పుడా రెండు, మూడు దశల ప్రయోగాలను భారత్ లో నిర్వహించేందుకు ఆక్స్ ఫర్డ్ వర్సిటీ సిద్ధమైంది. వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకాలతో భాగస్వామిగా ఉన్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తాజా క్లినికల్ ట్రయల్స్ కోసం భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి కోరింది. ఈ మేరకు దరఖాస్తు చేసుకుంది.

కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఎంత సురక్షితమన్న అంశంతోపాటు, ఇది కలుగజేసే ఇమ్యూనిటీ స్థాయిని అంచనా వేసేందుకు పెద్దవాళ్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని, అందుకు అనుమతించాలని కోరుతూ సీరమ్ ఇన్ స్టిట్యూట్ తన దరఖాస్తులో కోరింది.


More Telugu News