బంతి వేయకముందే ఆ బౌలర్ ను చదివేస్తా: విరాట్ కోహ్లీ

  • బ్యాటింగ్ సన్నద్ధతపై మాట్లాడిన కోహ్లీ
  • ప్రతి చిన్న అంశాన్ని పరిశీలిస్తానని వెల్లడి
  • అవుట్ అవుతామన్న భయం వదిలేయాలని సూచన
ప్రస్తుత క్రికెట్ లో విరాట్ కోహ్లీ తిరుగులేని ఆటగాడు. బ్యాటింగ్ టెక్నిక్ పరంగానే కాకుండా, మానసిక సన్నద్ధత, ఫిట్ నెస్... ఇలా ఏ అంశం తీసుకున్నా కోహ్లీ ఎంతో ప్రత్యేకం. తాజాగా బీసీసీఐ నిర్వహిస్తున్న ఓపెన్ నెట్స్ విత్ మయాంక్ అనే కార్యక్రమంలో టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ తో మాట్లాడుతూ ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. ఓ బౌలర్ బంతి వేయడానికి ముందే అతడ్ని పూర్తిగా చదివేస్తానని, బౌలర్ కు చెందిన ప్రతి చిన్న అంశాన్ని కూడా విశ్లేషించి ఆపై బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతానని వివరించాడు.

"బౌలర్ బంతిని ఎలా పట్టుకున్నాడో మొదట గమనిస్తాను. అతడి మణికట్టు పొజిషన్ ఎలా వుందో పరిశీలిస్తాను. లేకపోతే, గతంలో ఇలాంటి బంతిని వేసినప్పుడు అతడి బాడీ లాంగ్వేజి ఎలాఉందో ఓసారి గుర్తు తెచ్చుకుంటాను. ఆ బౌలర్ రనప్ లో ఏమైనా మార్పు కనిపిస్తోందా? మణికట్టు కదలికల్లో మార్పులు ఉన్నాయా? అనే అంశాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తాను. ఆ విధంగా ఓ బౌలర్ ఎలాంటి బంతి వేస్తాడో ముందే పసిగడతాను. ఓ బౌలర్ ఏ బంతి వేస్తాడో ముందే ఊహించి, దాన్ని భారీ షాట్ తో బయటికి తరలించడం నిజంగా అద్భుతంగా ఉంటుంది. అయితే అవుట్ అవుతామేమో అనే భయంతో ఆడితే ఏ విధంగానూ రాణించలేం" అని తెలిపాడు.


More Telugu News